సాక్షి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో త్వరలోనే రూ. 300 కోట్లతో ఫార్మసీ కంపెనీ స్థాపించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. జిల్లాలో 28 ఎకరాల్లో యాంటీ క్యాన్సర్ మిర్చిని పండించేందుకు ప్రభుత్వ భూమి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇక్కడ పండే మిర్చిని క్యాన్సర్ నిరోధక ముందుల్లో ఉపయోగిస్తారని తెలిపారు. శుక్రవారమిక్కడ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... మహబూబాబాద్ ఒకప్పుడు డివిజన్ కేంద్రంగా ఉండేదని..సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రస్తుతం జిల్లా స్థాయికి చేరిందన్నారు. 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. తాము మాత్రం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, సీఎంను ఒప్పించి మరిన్ని నిధులు జిల్లాకు తీసుకువస్తామని తెలిపారు.
‘మహబూబాబాద్‌ను అందంగా తీర్చిదిద్దుతా. కూరగాయల మార్కెట్ ప్రత్యేకంగా నిర్మించుకుందాం. అదే విధంగా మెడికల్ కాలేజీ, నూతన ఆస్పత్రి నిర్మిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతోంది. మరో నెల రోజుల్లో జిల్లాలోని అన్ని చెరువులను నింపుతాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంపుదల చేసి అందిస్తున్నాం. 57 ఏండ్ల వయోపరిమితి గల వారికి కూడా వచ్చే నెల నుంచి పెన్షన్ అందిస్తాం. పార్టీలో పని చేసిన, చేస్తున్న సీనియర్ నాయకులను టీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడు అదుకుంటుంది’ అని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment