
ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రీ వికారాబాద్‌కే!
తరలించాలని ప్రభుత్వ నిర్ణయం?
42 ఎకరాల్లోని ఆసుపత్రి స్థలంలో ఐఏఎస్ అధికారుల గృహ సముదాయం
పరిశీలనలో ఔషధ నియంత్రణ మండలి స్థలం కూడా
వాస్తు దోషం వల్ల ఎర్రగడ్డ రైతు బజార్ స్థలం సేకరణకు విముఖత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రిని వికారాబాద్ చేరువలోని అనంతగిరికి తరలించాలని ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై చెలరేగిన దుమారం ఇంకా కొనసాగుతుండగానే సర్కారు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఛాతీ వ్యాధుల ఆసుపత్రిని ఆనుకునే ఉన్న ప్రభుత్వ మానసిక చికిత్సాలయాన్ని (మెంటల్ హాస్పిటల్) కూడా అనంతగిరిలోనే ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అక్కడ స్థల సేకరణ అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే అధికారిక నిర్ణయం వెలువడనుంది.
ఛాతీ వ్యాధుల ఆసుపత్రి తరలింపుతో ఏర్పడే ఖాళీస్థలంలో సచివాలయాన్ని నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించిన ప్రభుత్వం అక్కడే ప్రభుత్వ పాలనా కార్యాలయాలతోపాటు ఉన్నతాధికారుల నివాసాలు కూడా ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఛాతీ వ్యాధుల ఆసుపత్రి స్థలంలో సచివాలయం నిర్మిస్తే అధికారుల నివాస గృహసముదాయానికి స్థలం కావాలి కాబట్టి మానసిక చికిత్సాలయం తరలింపుతో ఆ స్థలాన్ని సిద్ధం చేయాలనేది సీఎం కేసీఆర్ నిర్ణయంగా తెలుస్తోంది.
స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి...
ఎర్రగడ్డలో ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర కార్యాలయాల సముదాయాలు అన్నీ పక్కపక్కనే ఉన్నాయి. అక్కడ దాదాపు 150 ఎకరాల వరకు స్థలం ఉన్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతకాలంగా ఆ స్థలాన్ని ఇతరత్రా ప్రజోపయోగ నిర్మాణాలకు వినియోగించే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారం క్రితం రోడ్లు భవనాలశాఖకు చెందిన కొందరు అధికారులతో కలసి ఆయన ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు.
వెంగళరావు నగర్ వెళ్లే రోడ్డులోని ఔషధ నియంత్రణ మండలి డీజీ కార్యాలయం నుంచి ఆయన పరిశీలిన మొదలైంది. ఆ ప్రాంగణం కూడా విశాలమైందే. దానిని ఆనుకుని కేంద్రప్రభుత్వ రంగ సంస్థ కార్యాలయం ఒకటి ఉంది. ఆ తర్వాత ఛాతీ వ్యాధుల ఆసుపత్రి, దాని పక్కన మానసిక చికిత్సాలయం, ఆ తర్వాత ఎర్రగడ్డ రైతు బజార్ ఉంది. వీటన్నింటిని ఆయన వరుసగా పరిశీలించారు. ఇందులో రైతుబజార్ వద్ద ఓ అక్రమ నిర్మాణం వల్ల వాస్తు దోషం ఉందని గుర్తించి దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. అది పోను తొలుత ఛాతీ ఆసుపత్రి, మానసిక చికిత్సాలయం స్థలాలను సేకరించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ రెండూ కలిపితే 102 ఎకరాల స్థలం ఉందని అధికారులు తేల్చారు. అనంతగిరిలో టీబీ (క్షయ) శానిటోరియం సిద్ధంగా ఉన్నందున ఆ ప్రాంగణానికి మర మ్మతులు చేస్తే వెంటనే టీబీ ఆసుపత్రిని తరలించేందుకు అవకాశం ఉండటంతో తొలుత దాన్ని తరలించాలని ఆదేశించారు. ఆ తర్వాత 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మానసిక చికిత్సాలయాన్ని తరలించాలని ఆదేశించినట్టు తెలిసింది. ప్రస్తుతం మెంటల్ హాస్పిటల్ ఏర్పాటుకు అనంతగిరిలో ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీని తరలింపుతో అందుబాటులోకి వచ్చే 42 ఎకరాలను ఐఏఎస్ అధికారుల నివాస సముదాయానికి వాడాలని సీఎం భావిస్తున్నారు.
వెంగళరావు నగర్ దారిలోని ఔషధ నియంత్రణ మండలి కార్యాలయాన్ని తరలించటం ద్వారా ఆ స్థలాన్ని కూడా ఈ ప్రణాళికలో చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో వీటిపై చర్చించనున్నట్టు తెలిసింది. ఇప్పటికిప్పుడు 102 ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులోకి వస్తున్నందున అందులో ప్రభుత్వ పరిపాలన భవనం, అధికారుల నివాస గృహాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.