
సాక్షి, హైదరాబాద్: మరణం మనిషిని ఎటు నుంచి ఆవహిస్తుందే చెప్పడం కష్టంగా మారింది. ఈ మధ్య కాలంలో అకారణ మరణాలు పెరిగిపోతున్నాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారు ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్నారు. చిత్ర విచిత్ర కారణాలు మనిషిని చావు వరకు తీసుకెళ్తున్నాయి. గొంతులో ఆమ్లెట్, మాంసం ముక్క, కొబ్బరి ముక్క ఇరుక్కొని ప్రాణాలు విడిచిన ఘటనలు ఇటీవల చూశాం. తాజాగా ఓ వ్యక్తి నోట్లో కోడిగుడ్డు ఇరుక్కొని మృత్యువాతపడ్డాడు.
ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయంలో అనుమానాస్పద స్థితిలో ఓ రోగి మృతి చెందిన ఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పొట్టు తీయని గుడ్డు గొంతులో ఇరుక్కుని ఊపిరాడకపోవడం వల్లనే రోగి మృతి చెందినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే రోగిది సహజ మరణమేనని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి సమీపంలోని ఓ హోం నుంచి అంజి అనే వ్యక్తి సెప్టెంబర్ 5న ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేరారు.
ఆస్పత్రిలోని డీసీ వార్డులో చికిత్స పొందుతున్న అంజి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఊపిరాడని స్థితిలో ఉన్నట్లు ట్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సు లక్ష్మీ వైద్యాధికారి రఘువీర్‌రాజుకు సమాచారం ఇచ్చారు. దీంతో బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతి చెందాడు. పొట్టు తీయని గుడ్డును నోట్లో పెట్టుకోగా గొంతులో ఇరుక్కుని ఊపిరాడక చనిపోయినట్లు వార్తలు వెలువడగా, మానసిక చికిత్సాలయం ఆర్‌ఎంఓ మనోహర్ సోమవారం ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపారు.
చదవండి: ఏటీఎంలో రూ.14 లక్షలు చోరీ.. సీసీ కెమెరాలకు రంగేసి
Comments
Please login to add a commentAdd a comment