చికెన్, గుడ్లతో రోగనిరోధక శక్తి | Immunity Power Will Increase By Eating Eggs And Chicken | Sakshi
Sakshi News home page

చికెన్, గుడ్లతో రోగనిరోధక శక్తి

Published Sun, May 17 2020 3:40 AM | Last Updated on Sun, May 17 2020 3:40 AM

Immunity Power Will Increase By Eating Eggs And Chicken - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వాతావరణ మార్పులతో వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్‌ ద్వారా వ్యాపించే వ్యాధులతో పోరాడాలంటే ప్రజల్లో రోగనిరోధక శక్తి ఎంతో అవసరమని, చికెన్, గుడ్లు తినడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని వెంకటేశ్వర హేచరీస్‌ సంస్థ జీఎం యస్‌.బాలసుబ్రమణియన్‌ పేర్కొన్నారు. చికెన్, గుడ్లు తినడం ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పోషకాలు లభిస్తాయన్నారు. కరోనా వైరస్‌ దుష్ప్రచారంతో ధరలు తగ్గి చికెన్, గుడ్ల వినియోగం పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు ఆర్థికంగా చితికిపోయారన్నారు.

దీంతో పౌల్ట్రీ రైతులు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కొత్తగా కోళ్లను పెంచలేదన్నారు. లాక్‌డౌన్‌తో రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో కోళ్ల దాణా, బ్రాయిలర్‌కోడి పిల్లల సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అందువల్ల మార్కెట్లో డిమాండ్‌కు తగిన చికెన్‌ సరఫరా కావడం లేదని, ఫలితంగా చికెన్, గుడ్ల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా హోటల్స్, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లు, ఫుడ్‌ కౌంటర్లు మూతపడి ఉండటంతో కేవలం గృహ అవసరాలకు మాత్రమే చికెన్‌ వినియోగిస్తున్నారని, లేదంటే డిమాండ్‌ పెరిగి ధరల పెరుగుదల మరింత ఎక్కువగా ఉండేదని తెలిపారు.

సడలింపులతో ధరలు తగ్గే అవకాశం 
ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తుండటంతో వ్యాపార కార్యకలాపాలు మొదలవుతాయని, త్వరలోనే మార్కెట్‌ డిమాండ్‌కు సరిపడినంతగా చికెన్‌ ఉత్పత్తి పెరుగుతుందని సుబ్రమణియన్‌ తెలిపారు. ఈమేరకు పౌల్ట్రీ రైతులు, పౌల్ట్రీ ఇంటిగ్రేషన్‌ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, జూన్‌ 15 తర్వాత చికెన్‌ ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు, మీడియా చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, చికెన్‌మేళాల నిర్వహణ ద్వారా చికెన్‌ వినియోగంపై ప్రజల్లో ఏర్పడిన భయాందోళనలు తొలిగిపోయాయన్నారు. చికెన్, గుడ్లు తినేందుకు ప్రజలు తిరిగి ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. లాక్‌డౌన్‌ ముందు రాష్ట్రంలో ప్రతి నెల దాదాపు 4.2కోట్ల కోడిపిల్లలు ఉత్పత్తి అయ్యేవని, ప్రస్తుతం ఈ సంఖ్య 2.8 కోట్లుగా ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ రోజుల్లో 7.5 నుంచి 8 లక్షల కిలోల చికెన్‌ అమ్మకాలు జరుగుతాయని అందులో ఆదివారాల్లో మాత్రం 24 లక్షలు కిలోల చికెన్‌ అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement