జనగాంలో పారిపోయి జగిత్యాలలో దొరికాడు
►ప్రియురాలి సహాయంతో ఛేదించిన పోలీసులు
►వివిధ వేషధారణల్లో గ్రామంలోకి చందు
►ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు
సాక్షి, రాయికల్, (జగిత్యాల) : పోలీసులకు సవాల్‌గా మారిన పారిపోయిన ఖైదీ.. అంతర్‌జిల్లాల దొంగ అత్తినేని చంద్రమోహన్ ఉరఫ్ చందును గురువారం జగిత్యాల జిల్లా రాయికల్ పోలీసులు పట్టుకున్నారు. రాయికల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన అత్తినేని చంద్రమోహన్ ఉరఫ్ చందు తన ప్రియురాలిని కలవడం కోసం గ్రామ శివారులోకి వచ్చాడు. అప్పటికే గ్రామస్తులకు సమాచారం చేరవేసిన పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.
ప్రియురాలే పట్టించింది
చిన్నప్పటి నుంచి చందు జల్సాలకు అలవాటుపడ్డాడు. చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ ఖరీదైన వస్తువులు కొంటూ ప్రియురాలికి గిఫ్ట్‌లుగా ఇచ్చేవాడు. ఇదే క్రమంలో తాను ప్రియురాలితో దిగిన ఫొటోలు వాట్సప్‌లో పెట్టి అందరికీ షేర్‌చేసేవాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె చందును ఎలాగోలా పోలీసులకు పట్టించాలని వలపన్నింది. ఓ దొంగతనం కేసులో వరంగల్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న చందును గతనెల 16న అక్కడి పోలీసులు వాహనంలో హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు.
అనంతరం అక్కడ బిర్యానీ తిన్న తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరారు. సిబ్బంది నిద్రలోకి జారుకున్న విషయం గమనించిన చందు జనగామ మండలం యశ్వంతరావుపూర్ పెట్రోల్‌బంక్ సమీపం వద్దకు వాహనం రాగానే మూత్రవిసర్జన చేయాలని చంద్రమోహన్ ఎస్కార్ట్‌కు చెప్పాడు. దీంతో అతన్ని వాహనం నుంచి కిందకు దింపారు. ఈ క్రమంలో చేతులకు బేడీలు ఉన్నప్పటికీ ఎస్కార్ట్‌ను తోసేసి మెరుపువేగంతో తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులు చందును పట్టుకోడానికి జనగామ, కరీంనగర్, జగిత్యాల పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. రాయికల్ మండలంలోని ఓ గ్రామంలో ప్రియురాలితో సంబంధం ఉందని తెలుసుకొని గత వారం రోజుల నుంచి గ్రామంలో నిఘా పెట్టడంతో పాటు గ్రామంలో యువకులతో ఎప్పటికప్పుడు ఆయన సమాచారాలపై ఆరా తీయడం ప్రారంభించారు. చివరకు ప్రియురాలే ప్రియుడిని పట్టించింది.
చిన్నతనం నుంచే..
రాయికల్ మండలంలోని అయోధ్య గ్రామానికి చెందిన చందు జల్సాల కోసం దొంగగా అవతారమెత్తాడు. రాయికల్ ఠాణాలో దొంగతనంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. చందుకు 17 ఏళ్ల వయస్సులోనే మండలంలోని సింగరావుపేట గ్రామంలో 7.2.2014న పుప్పాల సుజాత–రాజిరెడ్డి ఇంట్లో దొంగతనంకు పాల్పడి అరకిలో వెండి, 9 తులాల బంగారం, మైతాపూర్ గ్రామంలో 12.04.2014న పడిగెల గంగారెడ్డి ఇంట్లో 3 తులాల బంగారం, అల్లీపూర్ గ్రామంలో 13.06.2014న అత్తినేని లింగారెడ్డి ఇంట్లో 6 తులాల, శంకర్ ఇంట్లో 4 తులాల బంగారం దొంగిలించి స్నేహితులతో కలిసి జల్సాలు చేసుకునేవాడు.
రాయికల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకొని కోర్టుకు అప్పగించగా మేజర్ కాకపోవడంతో బెయిల్‌పై విడుదలయ్యాడు. ఫిబ్రవరిలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు దొంగతనాలు చేయగా ఆయనను చాకచక్యంగా అక్కడి పోలీసులు పట్టుకొని 48 తులాల బంగారాన్ని రికవరి చేశారు. ఆయనను విచారణ నిమిత్తం స్టేషన్‌లో తీసుకోగా పోలీసుల కన్నుగప్పి అక్కడి నుంచి పరారై హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ ఖైరతాబాద్‌లో సైతం చోరీకి పాల్పడ్డాడు. ఆయన వద్ద నుంచి మూడు తులాల బంగారాన్ని రికవరి చేసినట్లు వన్‌టౌన్ ఎస్సై కిరణ్ తెలిపారు. అనంతరం చందును సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం పంపించారు.
టెక్నాలజీలో దిట్ట...
చందుకు చదువు అబ్బకపోయినా టెక్నాలజీ వినియోగించడంలో మాత్రం పూర్తిస్థాయిలో ఆరితేరాడు. ఎన్నోసార్లు పోలీస్‌స్టేషన్ నుంచి పరారయ్యాడు. దీంతో అక్కడి పోలీసుల ఉద్యోగాలు సైతం చందు వల్ల పోవడంతో ఎలాగైనా చందును పట్టుకోవాలనే కసి పోలీసుల్లో పెరిగింది. ముఖ్యంగా చందు వాట్సప్, ఐఎంవో, ఫేస్‌బుక్ కాలింగ్ ద్వారా ఎక్కువగా ఫోన్లు చేస్తూ ఎవరికి చిక్కకుండా తన పనులను చేసుకునేవాడు.
ఇటీవల పోలీసులు ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడంతో ఆ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో పోలీసులు ఆయన వాడుతున్న ఫేస్‌బుక్, ఐఎంవో, వాట్సప్ కాలింగ్‌లపై నిఘా పెట్టడంతో చందు ఉన్న ప్రదేశాలను గుర్తించి చాకచక్యంగా పట్టుకున్నారు. అంతేకాకుండా గ్రామంలోకి స్త్రీవేషాధారణ, హనుమాన్ దీక్ష వేషాధారణతో వచ్చి ప్రియురాలితో గడిపేవాడని గ్రామస్తులు తెలిపారు. ఏదేమైనా అంతర్‌జిల్లాల దొంగ దొరకడంతో ఇటు పోలీసులు, అటు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.