పెద్దపల్లి: మద్యం తాగి వాహనాలు నడపరాదని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా కొందరు వినడం లేదు. మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపిన వ్యక్తి ఓ రైతును బలితీసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని అంబారిపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అంబారిపేటకు చెందిన ముడిమడుగుల పోచయ్య(50) తన వ్యవసాయ పొలం దున్నడానికి మంగళవారం అదే గ్రామానికి చెందిన జాడి బానయ్యను పిలిచాడు. అతను అతిగా మద్యం తాగి, ఆ మత్తులో ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్నాడు.
వెనక ఉన్న పోచయ్యను గమనించకుండా వేగంగా నడపడంతో ట్రాక్టర్ అతన్ని తొక్కుకుంటూ వెళ్లింది. ఈ సంఘటనలో పోచయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్న బానయ్య పలుమార్లు ట్రాక్టర్‌ను మృతదేహం పైనుంచి తిప్పడంతో నుజ్జునుజ్జయి, తల, మొండెం, కాళ్లు, చేతులు వేటికవే పూర్తిగా తెగిపోయాయి. పొలం దున్నడం పూర్తయిన తర్వాత పోచయ్య కనిపించడం లేదని అతని కుమారుడు సతీశ్‌కు చెప్పాడు.
దీంతో కుటుంబసభ్యులు గ్రామంలో వెతకగా ఆచూకీ లభించలేదు. రాత్రి సమయంలో పొలంలో వెతకగా రక్తం, పోచయ్య శరీర భాగాలు కొద్దిగా కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు బుధవారం పొలంలో పూర్తిగా తెగిపడిన మృతుడి శరీర భాగాలను బయటకు తీయించి, పోస్టుమార్టం చేయించారు. పోచయ్య కుమారుడి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మద్యం తాగి, ట్రాక్టర్ నడిపి, పోచయ్య మృతికి కారణమైన బానయ్యపై కఠినచర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment