వైఎస్ఆర్ సీపీని చీల్చాలని యత్నిస్తూ ఇక్కడ గగ్గోలా?
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో విపక్షాలు ప్రవర్తించిన తీరు నీచమైన సంస్కృతిని నిదర్శనమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన సోమవారం ఉదయం 'సాక్షి' ప్రతినిధితో మాట్లాడుతూ పవిత్రమైన అసెంబ్లీని అవమానపరిచేలా ప్రతిపక్షాలు ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. జాతీయ గీతాన్ని అవమానపర్చడం సమంజసమా అని ఈటెల సూటిగా ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన సంఘటనల ఫుటేజ్లను పరిశీలిస్తే ఎవరు దోషులో తేలుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ది రాజకీయ శూన్యమేనని ఈటెల వ్యాఖ్యానించారు. తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు చెప్పుచేతల్లో పని చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చీల్చాలని టీడీపీ యత్నిస్తూ...ఇక్కడ గగ్గోలు పెట్టడం సమంజసమా అని ఈటెల అన్నారు. తెలంగాణ బతికిబట్టకట్టకూడదని... అస్థిరతలోనే ఉండాలని విపక్షాల యత్నమని ఆయన మండిపడ్డారు. సంక్షేమం, పల్లెప్రగతి, ఉపాధి లక్షయంగా కొత్త బడ్జెట్ ఉంటుందన్నారు. ప్రస్తుత బడ్జెట్లో ఆశించిన రాబడులు రానిమాట వాస్తవమేనని ఈటెల అంగీకరించారు. కేంద్రం నిధుల కేటాయింపుల విషయంలో తేడా వచ్చిందని ఈటెల అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని అధిగమిస్తామనే నమ్మకం ఉందని ఈటెల ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డివి ఒట్టి ప్రగల్బాలేనని, చేవలేని చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.