
సీఎస్టీ బకాయిలు విడుదల చేయండి
⇒ అరుణ్‌జైట్లీని కోరిన ఈటల
⇒ ఈ నెలలో రూ.400 కోట్ల విడుదలకు జైట్లీ అంగీకారం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం నుంచి వివిధ పథకాల్లో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఈ విషయంలో కల్పించుకొని నిధుల విడు దలకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. తెలంగాణకు రావాల్సిన రూ.10 వేల కోట్ల సీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీలు జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, కొత్త ప్రభాకర్‌తో కలసి ఈటల గురువారం ఢిల్లీలో జైట్లీతో భేటీ అయ్యారు.æ సీఎస్టీ బకాయిలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ. 400 కోట్లను ఈ నెల 24లోపు విడుదలయ్యేలా చూస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన రూ.450కోట్ల రెండో విడత నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామన్నారు.
‘భగీరథ’కు నిధులు చూద్దాం...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల కు నీతిఆయోగ్ చేసిన సిఫారసులకు అను గుణంగా రూ.19వేల కోట్లు కేటాయించాల ని జైట్లీని ఈటల కోరారు. కాగా, ఈ ప్రాజెక్టులకు నిధుల విడుదలను ‘చూద్దాం’ అన్నట్టుగా జైట్లీ స్పందించారని సమావేశం అనంతరం ఈటల మీడియాకు తెలిపారు. ఇదిలాఉండగా కేంద్ర గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో సమావేశమైన ఈటల.. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత రోడ్ల విషయంలో అన్యా యం జరిగిందని వివరించారు.
ప్రధానమంత్రి గ్రామసడక్ యోజ న, వెనుకబడిన జిల్లాల కోటాలో నిధులు కేటాయించాలని కోరారు.రాష్ట్రంలో కొత్త జిల్లాలన్నింటిలో కృషి విజ్ఞాన్ కేంద్రాలు ఏర్పాటుచేయాలని కేంద్ర వ్యవ సాయ మంత్రి రాధామోహన్ సింగ్‌ను ఈటల కోరగా, మహబూబ్‌నగర్, కొత్తగూడెం, మం చిర్యాల, సిరిసిల్ల రాజన్న తదితర జిల్లాల్లో ఈ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర మంత్రి ఆమోదం తెలిపారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి ప్రకాశ్‌జవదేకర్‌తో సమావేశమై న ఈటల.. సర్వశిక్షా అభియాన్, మాధ్యమిక శిక్షా అభియాన్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.1,008 కోట్లను విడుదల చేయాలని కోరారు.
రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట
రాష్ట్రంలో సంక్షేమానికి పెద్ద పీట వేసేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ట్టు మంత్రి ఈటల తెలిపారు. ఆదాయ పెంపు వృత్తులు, సేవా వృత్తులను విభజించి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు. గొర్రెలు, చేపల పెంపకం, నీటిపారుదల, వ్యవసాయానికి పెద్దపీట వేస్తామన్నారు.