ప్రతి కార్యకర్తా ఒక బాహుబలి కావాలి
► కష్టపడి పని చేస్తేనే గుర్తింపు
► సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి
మిర్యాలగూడ : కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్తా ఒక బాహుబలి కావాలని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీపట్టణ కార్యనిర్వహక అధ్యక్షుడిగా ఖరీం, పట్టణ అధ్యక్షుడిగా కేతావత్ శంకర్‌నాయక్, బ్లాక్ కాంగ్రెస్–2 అధ్యక్షుడిగా పొదిల శ్రీనివాస్ నియామకమైనే సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
రానున్న 45 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, అనుబంధ సంఘాల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యకర్తల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే పక్కనబెట్టి సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారికే పదవులు వస్తాయన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో నాలుగు సీజన్‌లకు సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయలేదన్నారు. ప్రస్తుతం రబీ సీజన్‌లో నీటిని విడుదల చేసినా పాలకులు, అధికారుల అవగాహన లోపంతో పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదన్నారు. కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టిడ్యామ్ నుంచి కనీసం 10 టీఎంసీల నీటిని తీసుకొస్తేనే పంటలు చేతికొచ్చే అవకాశం ఉందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లని అన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా నిధులు విడుదల చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు.
ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేసి మార్చి నెలాఖరు వరకు పనులు పూర్తి చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో మాజీ శాసనమండలి విప్ ధీరావత్ భారతీరాగ్యానాయక్, పీసీసీ సభ్యుడు పగిడి రామలింగయ్య, స్కైలాబ్‌నాయక్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ చిరుమర్రి కృష్ణయ్య, సల్కునూరు పీఎసీఎస్ చైర్మన్ కందిమళ్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.