‘చౌకీదార్‌’ను సమర్థించండి  | Every citizen of India is a Chowkidar says Piyush Goyal | Sakshi
Sakshi News home page

‘చౌకీదార్‌’ను సమర్థించండి 

Published Sun, Mar 24 2019 2:47 AM | Last Updated on Sun, Mar 24 2019 2:47 AM

Every citizen of India is a Chowkidar says Piyush Goyal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశాన్ని పురోభివృద్ధి దిశగా తీసుకెళ్తూ, ప్రపంచ దేశాల్లో భారత్‌ను ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేస్తున్న నరేంద్రమోదీ చౌకీదార్‌ (కాపలాదారు)ను మళ్లీ ప్రధాని చేసేందుకు అం దరూ మద్దతునివ్వాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కోరారు. 2014లో దేశ ఆర్థిక వ్యవస్థ పతన స్థాయికి చేరుకున్న దశలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఐదేళ్లలోనే అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. ఇదంతా కూడా సమర్థత, నిర్ణయాత్మక, శక్తివంతమైన నరేంద్రమోదీ నాయకత్వం వల్లనే సాధ్యమైందన్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన కం పెనీ సెక్రటరీలు, చార్టెర్డ్‌ అకౌంటెంట్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఇతర రంగాలవారు, సీఏ, కంపెనీ సెక్ర టరీ, ఇతర వృత్తివిద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులను ఉద్దేశించి గోయల్‌ మాట్లాడుతూ తెలంగాణ నుంచి బీజేపీ చౌకీదార్లను (ఎంపీలను) గెలిపించి మోదీని బలోపేతం చేయాలన్నారు. ఇక్కడి అవినీతి ప్రభుత్వానికి హెచ్చరికగా బీజేపీ ఎంపీలను పంపిస్తే పేదలు, రైతులు, ఇతర వర్గాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. శనివారం ఒక ప్రైవేట్‌ హోటళ్లో నిర్వహించిన ‘మై భీ చౌకీదార్‌’(నేను కూడా కాపలాదారున్ని) కార్యక్రమంలో బీజేపీ నాయకులు డా.కె.లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, ఎన్‌.రామచంద్రరావు, జి.కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.  

ఐటీ మదింపు మరింత సరళతరం 
ఆదాయపు పన్ను మదింపును మరింత పారదర్శ కంగా నిర్వహించడంతోపాటు సరళతరం చేసే చర్య లను ప్రభుత్వం చేపడుతోందని గోయల్‌ చెప్పారు. మొత్తం దాఖలు చేసిన లక్ష రిటర్న్స్‌లో కేవలం 0.3, 0.4 శాతం మాత్రమే స్క్రూటిని చేసి మిగతా వాటిని యథాతధంగా ఆమోదించనున్నట్టు వెల్లడించారు. సీఎం పీయూష్‌ గోయల్‌ అని కె.లక్ష్మణ్‌ తన ప్రసంగంలో ప్రస్తావించగా, ‘నన్ను సీఎంగా మార్చేశారు. ఈ రాత్రి సీఎం కేసీఆర్‌కు నిద్ర పట్టదు’ అంటూ గోయల్‌ అనడంతో హాలులో నవ్వులు విరిశాయి. 

పక్కదారి పట్టించేందుకే యాగాల చర్చ...
మోదీ చేసిన అభివృద్ధి చర్చకు రాకుండా పక్కదారి పట్టించేందుకే దేశంలో తనకంటే ఎక్కువ యాగాలు చేసిన వారెవరూ లేరంటూ సీఎం కేసీఆర్‌ చెబుతున్నారని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. మోదీ కంటే కేసీఆర్‌ ఎక్కువ హిందువో కాదో తెలియదుకానీ, అసదుద్దీన్‌ ఒవైసీ కంటే ఎక్కువ ముస్లింగా కేసీఆర్‌ మారారని ఎద్దేవా చేశారు. మోదీ హయాంలోనే అయోధ్యలో రామమందిరం నిర్మితమవుతుందని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కేసీఆర్‌ తీసుకొచ్చిన ఫెడరల్‌ ఫ్రంట్‌ పడిపోయే టెంటేనని వ్యాఖ్యానించారు.

మోదీ గత ఐదేళ్లలో ఒక్కరోజుకూడా సెలవు తీసుకోలేదని, ఆయనకు ఫామ్‌ హౌస్‌ లేదు, రెస్ట్‌ హౌస్‌ లేదని బీజేపీ నేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యలు తీరడానికి కేంద్రం చేపట్టిన చర్యలే కారణమని బీజేపీ హైదరాబాద్‌ నగర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న మేకిన్‌ ఇండియా అందించిన తోడ్పాటు కారణంగానే తెలంగాణలో అమెజాన్, గూగుల్‌ సంస్థలతోపాటు కొత్తగా పెట్టుబడులు వచ్చాయని, వాటిని తమ గొప్పదనంగా కేటీఆర్‌ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఎన్డీయేకు మూడింట రెండు వంతుల మెజార్టీ 
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడు వందలకు పైగా సీట్లను కైవసం చేసుకుంటుందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి 60 స్థానాలకు మించి రావని అన్నారు. ఐదేళ్ల మోదీ పాలనలో దేశం సురక్షితంగా ఉందన్నారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఫిక్కీ)కి చెందిన ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ ‘విజన్‌ ఇండియా’పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పీయూష్‌ గోయల్‌ ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాలను మీడియాతో పంచుకున్నారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలను చాలామంది అసాధ్యంగా పరిగణించారని, వాటిని సాధ్యం చేసి చూపించామని చెప్పారు.

దేశంలోని 77 కోట్ల సంప్రదాయ బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేయాలని 2015 జనవరిలో సంకల్పించామని.. ఈ బల్బుల వాడకం వల్ల దేశవ్యాప్తంగా ఏటా రూ.50 వేల కోట్లు ఆదా అవుతోందన్నారు. మహిళల శ్యానిటరీ ప్యాడ్స్‌ విషయంలోనూ ఇదే తరహా విప్లవాన్ని తీసుకు రావాలని, ఒక్క రూపాయికే ప్యాడ్స్‌ అందించడం కష్టమేమీ కాదని పీయూష్‌ అన్నారు. ఎన్నికల్లో తగినంత మెజార్టీ రాకపోతే తెలంగాణలో కె.చంద్రశేఖరరావు లేదా  ఏపీలో వై.ఎస్‌.జగన్మోహనరెడ్డిలతో జట్టు కట్టే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు పీయూష్‌ సమాధానమిస్తూ పగటి కలలు కనేందుకు జీఎస్టీ కట్టనవసరం లేదని చమత్కరించారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement