
జిల్లాకో మహిళా గురుకుల డిగ్రీ కాలేజీ
వరంగల్‌లో 10న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఒక్కో ప్రభుత్వ మహిళా గురుకుల డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఇందులో భాగంగా మొదట మెదక్, వరంగల్‌కు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. స్థలాలు లభించిన జిల్లాల్లో మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను వరంగల్‌లోనూ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 10న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.
ఈ విద్యా సంవత్సరంలోనే (2015-16) తాత్కాలిక భవనంలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రవేశాలు చేపట్టి, తరగతులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కాగా, వరంగల్‌లో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రిని సీఎం కేసీఆర్, తాను కలసి స్వయంగా మాట్లాడినట్లు చెప్పారు. ప్రతిపాదనలు పంపించామని, త్వరలోనే అమోదం లభిస్తుందని కేంద్రమంత్రి పేర్కొన్నట్లు చెప్పారు. మహబూబ్‌నగర్‌కు కూడా సైనిక్ స్కూల్ మంజూరు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.