హింస లేని సమాజం అందరి బాధ్యత
పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య
మలక్‌పేట: మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టంలో పాలకులు విఫలమయ్యారని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య అన్నారు. మూసారంబాగ్ డివిజన్‌లోని సిద్ధార్థ కళాశాలలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో స్త్రీలు వివిధ రకాల హింసలకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పితృస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. హింసలేని సమాజం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. శ్రామిక, మహిళా విముక్తి లక్ష్యంగా స్త్రీ పురుషుల సమానత్వం కోసం ఉద్యమించాలన్నారు. అరుణోదయ కళామండలి వారు ఆలపించిన గీతాలు అందరిని ఆలోచింపజేశాయి. ఐఎఫ్‌టీయూ నాయకులు నరేందర్, వెంకటేశ్వర్లు స్వాగతోపన్యాసం చేయగా.. ‘మహిళలు- చట్టాలు’ అనే అంశంపై హైకోర్టు అడ్వకేట్ హేమలత ప్రసంగించారు. ‘మహిళలు-ఆరోగ్యం’ అనే అంశంపై డాక్టర్ సమతారోష్ని మాట్లాడారు. కార్యక్రమంలో నగర అధ్యక్ష, కార్యదర్శులు సరళ, జయసుధ, నాయకురాలు పద్మ, రాములమ్మ, భారతి, ఫాతిమా, పీడీఎస్‌యూ ఈస్ట్‌జోన్ అధ్యక్షులు రియాజ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.