‘పరీక్ష’ పరుగు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం/
షాద్‌నగర్/వనవర్తి/ జడ్చర్ల/ గద్వాల : జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన డీ-సెట్ 2014 (డైట్‌సెట్) ప్రవేశపరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాకేంద్రంలో 114 కేంద్రాల్లో, షాద్‌నగర్‌లో 13, జడ్చర్లలో 12, గద్వాలలో 19, వనపర్తిలో 22 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. తెలుగు మీడియంలో 41,942 మంది, ఉర్దూ మీడియంలో 1195 మంది మొత్తంగా 43,037 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావల్సి ఉండగా తెలుగుమీడియంలో 39,145 మంది, ఉర్దూమీడియంలో 1,131 మంది మొత్తం 40,276 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. 2,889 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభం అవ్వగా కొందరు తెల్లవారుజామునే కేంద్రాలకు చేరుకున్నారు.
దూరప్రాంతాలవారు ఒకరోజు ముందుగా చేరుకోగా ట్రాఫిక్ అంతరాయం, ఇతర కారణాలతో ఆలస్యంగా వచ్చిన వారు ఎంత వేడుకున్నా అధికారులు వారిని అనుమతించలేదు. కేంద్రాల వారీగా వివరాలను పరిశీలిస్తే.. జిల్లాకేంద్రంలో 27,360 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 25,975 మంది హాజరవ్వగా 1385 మంది గైర్హాజరయ్యారు. అలాగే జడ్చర్లలో 2880మంది విద్యార్థులకు 2715మంది పరీక్షలు రాయగా 165మంది గైర్హాజర య్యారు. ఎంఈఓ కృష్ణయ్య కేంద్రాలను సందర్శించారు. వనపర్తిలో 22 కేంద్రాలను ఏర్పాటు చేయగా ఒక్కొక్క కేంద్రంలో 240 మంది చొప్పున మొత్తం 5117 మంది అభ్యర్థులకు గాను 4786 మంది హాజరు కాగా 331 మంది గైర్హాజరయ్యారు. రాష్ట్ర పరిశీలకులు గోవిందరాజులు పరీక్షలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌లో 3120మందికి 2859 అభ్యర్థులు హాజరవ్వగా 261మంది గైర్హాజరయ్యారు.
నల్గొండజిల్లా డిప్యూటీ డీఈఓ రాంరెడ్డి పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. గద్వాలలో 4560 అభ్యర్థులకు, 4022 మంది హాజరయ్యారు. ఇదిలావుండగా వనపర్తి పట్టణంలో నలుగురు అంధులు సహాయకుల సహకారంతో పరీక్షలు రాశారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రమోహన్ తనిఖీ చేశారు. రాష్ట్ర పరిశీలకుడు రవికాంత్‌రావు జిల్లాలోని పలు కేంద్రాలను పర్యవేక్షించారు. అన్ని కేంద్రాల్లోనూ భారీ బందోబస్తు మధ్య పరీక్షలు జరిగాయి.