భయం వీడితే.. జయం మీదే.. | exams time | Sakshi
Sakshi News home page

భయం వీడితే.. జయం మీదే..

Published Sun, Mar 1 2015 1:06 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

exams time

పరీక్షల కాలం వచ్చేసింది. మార్చి 9 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు, 25 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా విద్యార్థులు గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతూ కనిపిస్తున్నారు. అయితే పబ్లిక్ పరీక్షలంటే విద్యార్థుల్లో ఒక రకమైన భయం నెలకొంటుంది. ఎన్ని పరీక్షలు రాసినా ప్రతి పరీక్ష కొత్తగానే అనిపిస్తుంది. పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడికి గురవుతూనే ఉంటారు. దీంతో చదివింది గుర్తుకు రాక, జవాబులు రాయలేక మార్కులు కోల్పోతుంటారు. ఈ సమయంలో భయాన్ని, ఒత్తిడిని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే వందశాతం ఫలితాలు సాధించడం సులభమేనని నిపుణులు సూచిస్తున్నారు. కచ్చితమైన ప్రణాళిక, నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు వెళితే విజయం తథ్యమని వారు చెబుతున్నారు.
 -మహబూబ్‌నగర్ విద్యావిభాగం
 
పునశ్చరణ తప్పనిసరి..
 
ఇప్పుడు విద్యార్థులకు  పునశ్చరణ తరగతులు చాలా కీలకం. కొంతమంది పరీక్షలకు ముందు బాగా చదువుతారు. పరీక్ష హాల్లోకి వెళ్లగానే చదివింది మర్చిపోతుంటారు. పరీక్షలే కీలకం కావడంతో చదివినవన్నీ గుర్తుకు తెచ్చుకోవాలి, ఏది మరిచిపోయాం, ఎందుకు మర్చిపోయామో గమనించాలి. ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వస్తాయో ముందుగానే అంచనాకు రావాలి. ఈ మేరకు పరీక్షలకు మానసికంగా సిద్ధం కావాలి.
 
ఒత్తిడి వద్దు..
 
మార్కులు బాగా రావాలని తల్లిదండ్రులు చేసే ఒత్తిడే విద్యార్థుల చేత తప్పులు చేయిస్తుంది. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇంట్లో మంచి వాతావరణం ఉండాలి. బలవంతంగా తమ అభిప్రాయాలను రుద్దకూడదు. ర్యాంకులు వస్తాయని ఆశించి రాలేదని నిందించొద్దు. అలా చేస్తే వారు మానసిక స్థైర్యంకోల్పోతారు. బాగా మార్కులు వస్తే బహుమతులు కొనిస్తామంటూ ప్రోత్సహించాలి.
 
పరీక్షల షెడ్యూల్
 
ఇంటర్మీడియట్: మార్చి 9 నుంచి 24 వరకు
ఎస్‌ఎస్‌సీ: మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు  
 
ఆహార అలవాట్లూ ముఖ్యమే..
 
పరీక్షల సమయంలో ఆహారపు అలవాట్లలోనూ జాగ్రత్తలు పాటించాలి. ఇష్టం వచ్చిన ఆహారం తినడంతో ఆరోగ్య సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. ఆకుకూరలు, పాలు, చేపలు తినాలి. నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. పరీక్షల్లో బాగా రాయాలని, సమయపాలన లేకుండా చదవడం కూడా సరికాదు. నిద్రలేమితో మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఏకాగ్రత కోల్పోతుంటారు. అందుకే నిద్ర పరిపూర్ణంగా ఉండాలి.
 
ఆత్మవిశ్వాసం ఉండాలి..
 
పరీక్ష హాల్లోకి సంపూర్ణ విశ్వాసంతో వెళ్లాలి. భయం, ఒత్తిడితో సమయం వృథా చేయొద్దు. తొలుత ప్రశ్నపత్రాలను పరీక్షించాలి. తెలిసిన ప్రశ్నలన్నింటికీ మందుగా జవాబులు రాయాలి. ఆ తర్వాత సందేహం ఉన్న ప్రశ్నలకు జవాబులు రాస్తే కొంత ఒత్తిడి తగ్గుతుంది.
 
అన్ని సబ్జెక్టులూ ముఖ్యమే...
 
పబ్లిక్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం ఇవ్వాలి. అన్ని అంశాలపై దృష్టి సారించాలి. రోజూ ఒక్కో సజ్జెక్టుకు నమూనా పరీక్షలు రాయాలి. ఇలా చేయడం ద్వారా చదివినవి ఎంతవరకు గుర్తున్నాయి, ఎన్ని మార్కులు వస్తాయో ఒక అవగాహన కలుగుతుంది. పరీక్షలంటే భయం కూడా పోతుంది.
 
 ఇవీ ప్రధానమే..
 
చదువుకోవడానికి పక్కా టైమ్‌టేబుల్ వేసుకోవడం తప్పనిసరి.
 ఏ సబ్జెక్టుకు ఎంత టైమ్ కేటాయించాలో ముందుగానే నిర్ధారించుకోవాలి.
బలాలు, బలహీనతలను నిజాయితీగా ఒప్పుకుని, బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేయాలి.
మాక్ టెస్టులు ఎక్కువగా రాస్తే పరీక్షలపై ఉన్న భయం పోతుంది.
లెక్కలు, ఫిజిక్స్ సూత్రాలు, కెమిస్ట్రీలోని ఫార్ములాలు ఎప్పటికప్పుడు చూసుకోవాలి.
ఇంగ్లిష్ గ్రామర్‌పై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి. రోజుకు ఓ పేరా అయినా ప్రాక్టీస్ చేయాలి.
మార్కులపై కాకుండా సబ్జెక్టుపై ప్రధానంగా దృష్టి సారించాలి.
పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన సీనియర్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలి.
 
పాతప్రశ్నపత్రాల పరిశీలన
 
మూడు, నాలుగేళ్ల క్రితం నాటి ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంటే వాటిని కూడా చదవాలి. నమూనా ప్రశ్నలుగా పరిగణించుకుని వాటికి జవాబులు రాస్తే కొంత వరకు రాబోయే ప్రశ్నలపై అవగాహన వస్తుంది. పరీక్షలు ఎలా రాస్తున్నామో, ఎన్ని మార్కులు వస్తున్నాయో సొంతంగా పరీక్షించుకోవాలి.  
 
పరీక్షలంటే పండుగలాంటివి

పరీక్షలంటే పండుగలాంటివి. విద్యార్థి సంవత్సరం అంతా చదివి కష్టపడి చదివితే మార్కులు అనే ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్నే పండుగ అంటారు. పరీక్షలంటే భయం సహజమే, అవసరాన్ని మించిన భయం మంచిది కాదు. భయపడే విద్యార్థులే మంచి మార్కులు సాధిస్తారని నిపుణులు అంటారు. విద్యార్థికి సమయపాలన చాలా ముఖ్యం. ఒకటి నుంచి పది, ఇంటర్ వరకు కొన్ని వందల పరీక్షలు విద్యార్థులు రాసి ఉంటారు. ఈ పరీక్షలు వారికి లెక్కకాదు. రోజులో చురుకుగా ఉన్నప్పుడు అతికష్టమైన సబ్జెక్టు చదవాలి. చాలా అలసిపోయినప్పుడు అతి సులభమైన సబ్జెక్టును చదవాలి. పరీక్షహాలుకు కనీసం అరగంట ముందు వెళ్లాలి. ప్రశ్నాపత్రాన్ని తీసుకున్నాక ఒకసారి ప్రశ్నలను మొత్తాన్ని చదవాలి. ప్రశ్నాపత్రాన్ని తీసుకున్న తరువాత భయం అనిపిస్తే గ ది పైకప్పు వైపు చూసి గట్టిగా రెండుమూడు సార్లు శ్వాస పీల్చుకొని వదలాలి. దీనివల్ల రక్త ప్రసరణ అదుపులోకి వస్తుంది. పూర్తి సమయం పరీక్ష హాల్‌లో గడిపిన తరువాతనే బయటికి రావాలి. ఆతరువాత వెంటనే ఇంటికి వెళ్లాలి కానీ జరిగిన పరీక్ష గురించి చర్చలు చేయవద్దు. పరీక్షలు పూర్తయ్యే వరకు మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది. ఎక్కువగా మజ్జిగ వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలి.     - డాక్టర్ శ్రీనాథాచారి, ప్రముఖ సైకాలజిస్టు
 
మానసిక ఆందోళనకు గురి కావద్దు...

విద్యార్థి మానసిక ఆందోళనకు గురి కావద్దు. నిద్ర మానుకుని ఎక్కువగా చదవొద్దు. 6గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. అప్పుడే చదువుకున్నవి గుర్తుంటాయి. త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. మసాల, జంక్‌ఫుడ్స్, బయటి ఆహారం తీసుకోరాదు. చదివిన దానిని మాత్రమే రివిజన్ చేసుకోవాలి. మానసిక, శారీరక సమతుల్యం పాటించాలి. ఆయిల్ ఫుడ్స్, మసాలలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లో తీసుకున్న ఆహారాన్నే తీసుకోవాలి. పాలు, గుడ్డువంటివి తీసుకోవడం మంచిది. ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ చేయాలి.     - పీఎస్ రెడ్డి, ఫిజిషియన్, ఛాతి వైద్య నిపుణుడు
 
టెన్షన్ పడవద్దు

విద్యార్థులు పరీక్షల ముందు టెన్షన్ పడవద్దు. ఉత్తమ ఫలితాలు సాధిం చేందుకు 60రోజుల క్రాష్ ప్రోగ్రాం ద్వా రా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేశాం. ముఖ్యమైన ప్రశ్నల కు సంబంధించి మోడల్‌పేపర్లు తయారు చేసి ఇచ్చాం. పరీక్షలు దగ్గరలో ఉన్నా యి కాబట్టి చదవని వాటికి దూరంగా ఉండి చదివిన వాటిని రివైజ్ చేసుకోవాలి. సరైన ఆహారం తీసుకొని విద్యార్థులు ప్రశాం తంగా చదువుకోవాలి.     - డీఎస్‌హెచ్ విజయలక్ష్మి,
     ఇన్‌చార్జి ఆర్‌ఐఓ, డీవీఈఓ
 
గ్రూప్ చర్చలు ఉపయోగకరం..

విద్యార్థులు ఆందోళన పడకుండా చదివిన వాటిని రివిజన్ చేసుకోవడంతో పాటు, గ్రూపు చర్చలు ఫలితాన్ని ఇస్తాయి. అన్నిచోట్ల సిలబస్ అయిపోయింది. నేర్చుకున్న అంశాన్నే మళ్లీ నేర్చుకోవాలి. నెగెటివ్ థింకింగ్‌ను వీడాలి. పుస్తకంపై కమాండ్ పెంచుకోవాలి. అనవసరమైన భయాన్ని వీడాలి. ఎలాగైన రాయగలమనే కాన్ఫిడెన్స్‌ను పెంచుకోవాలి. ప్రశ్నాపత్రాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అన్ని ప్రశ్నలను రాసేందుకు ప్రయత్నించాలి. టైంటేబుల్ ప్రకారం చదవాలి. టీవీకి దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు పరీక్షలపై భయాన్ని పోగొట్టేందుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాం. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నాం.     -నాంపల్లి రాజేష్, డీఈఓ
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement