ప్రతిభకు అందని ఉపకార వేతనాలు | Excellence to not available scholarships | Sakshi
Sakshi News home page

ప్రతిభకు అందని ఉపకార వేతనాలు

Published Sat, Apr 9 2016 4:38 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

Excellence to not available scholarships

కమ్మర్‌పల్లి : అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంలా మారింది. తమకు రావాల్సిసిన జాతీయ ఉపకార వేతనాలు సక్రమంగా రాకపోవడంతో ఎవరిని ఆశ్రయించాలో తెలియక తికమకపడుతున్నారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి ఇలా ఎవరిని అడిగినా మాకు తెలియదు అనే సమాధానమే వసోతంది. పోటీ పరీక్షలో తమ ప్రతిభను చూపి ఉపకార వేతనాలకు ఎంపికైన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందని ద్రాక్షే అవుతున్నాయి.

మండలంలో నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్‌లు సక్రమంగా అందక విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా విద్యార్థుల ఉన్నత చదువులపై ప్రభావం పడుతోంది.
 
ఎన్‌ఎంఎంఎస్ పథకం తీరిది..
ప్రభుత్వం పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులను చదువులో ప్రోత్సహించేందుకు 2008లో అప్పటి కేంద్రప్రభుత్వం నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీం(ఎన్‌ఎంఎంఎస్)ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద స్కాలర్‌షిప్‌లు అందించడానికి జిల్లా కేంద్రంలో ప్రతి సంవత్సరం నవంబర్‌లో ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థులకు ప్రతిభ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులను స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తున్నారు.

ప్రతిభ పురస్కారానికి ఎంపికైన విద్యార్థులకు మరుసటి సంవత్సరం నుంచి అంటే 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ పూర్తయ్యే వరకు సంవత్సరానికి రూ. 6 వేల చొప్పున నాలుగేళ్ల పాటు స్కాలర్‌షిప్ విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఇందుకోసం విద్యార్థి బ్యాంకులో ఖాతా తీయాలి. ప్రభుత్వమే నేరుగా విద్యార్థి ఖాతాలో ప్రతి విద్యా సంవత్సరంలో జూన్ నెల నుంచి డిసెంబర్ నెలాఖరులోగా రూ. 6 వేలను ఖాతాలో జమ చేస్తారు.
 
మండలంలో పరిస్థితి ఇదీ..
కమ్మర్‌పల్లి మండలంలో 8 ఉన్నత పాఠశాలలున్నాయి. 2009 నుంచి ఇప్పటి వరకు 64 మంది ఎంపికయ్యారు. అయితే గడిచిన రెండేళ్ల నుంచి అంటే 2014-15, 2015-16 సంవత్సరాలకు సంబంధించి స్కాలర్‌షిప్ డబ్బులు వారి ఖాతాల్లో జమ కావడం లేదు. ఇందులో 2013 సంవత్సరం వరకు స్కాలర్‌షిప్‌లు గత జూలై 2015లో అందాయి. 2014 సంవత్సరం నుంచి విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని విద్యార్థులు తెలిపారు. కొంతమందికి 2010లో కూడా డబ్బులు జమ కాలేవన్నారు.

రెండు మూడేళ్లకోసారి ఒక ఏడాదివి (రూ. 6 వేలు) మాత్రమే వస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. మరికొంత మందికి అసలే రాలేవన్నారు. స్కాలర్‌షిప్ విషయమై 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులు తమ ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకువచ్చినా, డీఈఓ కార్యాలయంలో తెలుసుకోవాలంటూ ఇప్పటి వరకు సమాధానం దాటవేస్తూ వచ్చారు. ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలకు వెళ్లి స్కాలర్ షిప్ గురించి ఆరా తీసినా ఫలితం లేకుండాపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి స్కాలర్‌షిప్‌లు అందేలా చూడాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు.
 
రెండేళ్ల నుంచి రావడం లేదు
కమ్మర్‌పల్లి పాఠశాలలో టెన్త్ వరకు చదివాను. ఎనిమిదో తరగతిలో స్కాలర్‌షిప్ పరీక్ష రాసి ఎంపికయ్యాను. 2013 స్కాలర్‌షిప్ డబ్బు లు 2015 జూలైలో వచ్చాయి. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ అయిపోయింది. రెండేళ్లది కలిపి రూ. 12 వేలు స్కాలర్ షిప్ రావాలి.
 -ఉట్నూర్ శాంతిప్రియ, ఇంటర్మీడియెట్ సెకండియర్, కమ్మర్‌పల్లి
 
సార్లు తెలియదంటున్నారు
8వ తరగతిలో ఉన్నప్పుడు(2011లో) పరీక్ష రాసి స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యాను. 9వ తరగతి నుంచి డబ్బులు వస్తాయన్నారు. రెండేళ్లవి మాత్రమే రూ. 12 వేలు మాత్రమే వచ్చాయి. సార్లను అడిగితే తెలియదంటున్నారు. అధికారులు స్పందించి స్కాలర్ షిప్ డబ్బులు త్వరగా అందేటా చూడాలి.
- రాజేందర్, ఇంటర్మీడియెట్, కమ్మర్‌పల్లి
 
మంజూరు చేయాలి
స్కాలర్‌షిప్‌కు ఎంపికైన నాటి నుంచి స్కాలర్ షిప్ డబ్బులు సక్రమంగా రావడం లేదు. ఎవరిని అడగాలో తెలియడం లేదు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ పూర్తి చేశాను. రెండేళ్ల స్కాలర్‌షిప్ రూ. 12 వేలు రావాలి. అధికారులు స్పందించి వెంటనే మంజూరు చేయాలి.
 - కొంటికంటి అంజలి, ఇండర్మీడియెట్, కమ్మర్‌పల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement