NMMS scheme
-
‘ఉపాధి’లో ఆన్లైన్ హాజరు! జనవరి 1 నుంచి కేంద్రం కొత్త నిబంధనలు
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో కేంద్రం మరిన్ని కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. జనవరి 1 నుంచి ఈ పథకం కింద చేపట్టే అన్నిరకాల పనులను నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్ (ఎన్ఎంఎంఎస్) ద్వారా నమోదు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఉపాధి పనుల్లో కూలీల ‘మాన్యువల్ అటెండెన్స్’కు చెల్లుచీటీ పలికింది. ఇకపై లైవ్ లొకేషన్లో మొబైల్ యాప్ ద్వారానే అన్నిరకాల పనులకు సంబంధించిన పనుల వివరాలు, కూలీల హాజరును నమోదు చేయాలని స్పష్టం చేసింది. అయితే వ్యక్తిగత మరుగుదొడ్లు, సోక్ పిట్స్, క్యాటిల్ షెడ్స్ తదితర వ్యక్తిగత ప్రయోజన పనులు, ప్రాజెక్టులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు, ఉపాధి హామీ పథకం కమిషనర్లకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఉపాధిహామీ పథకం అమలు డైరెక్టర్ ధర్మవీర్ ఝా ఉత్తర్వులను పంపించారు. ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడం, పౌర సమాజం పర్యవేక్షణకు వీలుగా కొత్త నిబంధనలు తెచ్చినట్టు అందులో పేర్కొన్నారు. ఇప్పటికే మొదలు.. ఉపాధి హామీ కూలీల హాజరును రోజుకు రెండుసార్లు తప్పనిసరిగా ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా లైవ్ లొకేషన్లో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాలనే నిబంధనను కేంద్రం ఈ ఏడాది మే నెలలోనే తీసుకొచ్చింది. కూలీల అటెండెన్స్ రోజుకు రెండుసార్లు సమయంతో సహా నమోదయ్యేలా, కూలీల ఫొటోలను జియోట్యాగ్ చేసేలా ఏర్పాట్లు చేసింది. అయితే ఇరవై మందికిపైగా కూలీలు పనిచేసే సైట్లలో మాత్రమే వాటిని అమలు చేశారు. ఇప్పుడు ఉపాధి హామీ కింద చేపట్టే అన్ని పనుల్లో (వ్యక్తిగత ప్రయోజన పనులు మినహా) ఎన్ఎంఎంఎస్ ద్వారానే కూలీల హాజరు నమోదు చేయాలని తాజాగా కేంద్రం ఆదేశించింది. జనవరి 1 నుంచి ఈ వి«ధానాన్ని కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఆన్లైన్ నమోదులో ఇబ్బందులెన్నో.. ఉపాధి హామీ పనులు జరిగే మారుమూల ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ సమస్య ఉండటం, అందరికీ స్మార్ట్ఫోన్లు, డేటా లేకపోవడం వంటి సమస్యల వల్ల ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల అటెండెన్స్ నమోదు ఇబ్బందికరమేనని క్షేత్రస్థాయిలో ఈ పథకం పరిశీలకులు చెప్తున్నారు. కూలీలు చేసే పనుల కొలతలు, పరిమాణం ప్రకారమే కూలి డబ్బు ఇస్తున్నపుడు కొత్త నిబంధనలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సరిగా పని, కూలి సొమ్ము అందక ఉపాధి హామీ పథకానికి గ్రామీణ పేదలు దూరమవుతున్నారని అంటున్నారు. లైవ్ లొకేషన్లో మొబైల్ యాప్ ద్వారా అటెండెన్స్ నమోదు వంటి చర్యలు మరింత ప్రతిబంధకంగా మారతాయని స్పష్టం చేస్తున్నారు. -
సత్తా చాటండి.. సాయం పొందండి
అనంతపురం, రాప్తాడు: కొందరు విద్యార్థుల్లో ఎంతటి ప్రతిభ ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్నా రు. అటువంటి వారిని ప్రోత్సాహిం చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్స్( ఎన్ఎం ఎంఎస్) పేరిట ఉపకార వేతనం అం దిస్తోంది. ఇందుకుగానూ నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించిన వారికి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం లభిస్తుంది. గత ఏడాది వరకు రూ.6 వేల చొప్పున ఇచ్చేవారు. ఈ సంవత్సరం నుంచి రూ.12 వేలకు పెంచారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 24వరకు అవకాశం ఉంది. ఆసక్తి గల విద్యార్థులు దీన్ని వినియోగించుకోవాలని ఉపా«ధ్యాయులు సూచిస్తున్నారు. ఎంపిక ఇలా... దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నవంబర్ మొదటివారంలో పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో ప్రతిభ కనబరిచిన వారిని ఉపకార వేతనానికి ఎంపిక చేస్తారు. ఎనిమిదో తరగతి చదువుతున్న వారు పరీక్ష రాసేందుకు అర్హులు. దీనిలో అర్హత సాధిస్తే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఏడాదికి రూ.12వేలు విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ స్కాలర్షిప్ కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకే ఇస్తారు. కాగా ఒక్కసారి స్కాలర్షిప్ మొత్తం రెట్టింపు చేయడంతో అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. రాప్తాడు, హంపాపురం, మరూరు, ఎం.బండమీదపల్లి, కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. గత ఏడాది ఏపీ మోడల్ స్కూల్లో ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. రాప్తాడు, హంపాపురం, మరూరు పాఠశాలల నుంచీ ఎంపికయ్యారు. పరీక్షా విధానం ప్రతిభ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేవారు మండల పరిషత్, జిల్లా పరిషత్, గురుకుల పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతూ ఉండాలి. ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు సాధిం చాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఈ అర్హత పరీక్ష 180 మార్కులకు నిర్వహిస్తారు. రీజనింగ్, అర్థమెటిక్, గణితం, సైన్స్, సోషల్, అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. జనరల్, బీసీ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
ప్రతిభకు అందని ఉపకార వేతనాలు
కమ్మర్పల్లి : అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంలా మారింది. తమకు రావాల్సిసిన జాతీయ ఉపకార వేతనాలు సక్రమంగా రాకపోవడంతో ఎవరిని ఆశ్రయించాలో తెలియక తికమకపడుతున్నారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి ఇలా ఎవరిని అడిగినా మాకు తెలియదు అనే సమాధానమే వసోతంది. పోటీ పరీక్షలో తమ ప్రతిభను చూపి ఉపకార వేతనాలకు ఎంపికైన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందని ద్రాక్షే అవుతున్నాయి. మండలంలో నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్లు సక్రమంగా అందక విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా విద్యార్థుల ఉన్నత చదువులపై ప్రభావం పడుతోంది. ఎన్ఎంఎంఎస్ పథకం తీరిది.. ప్రభుత్వం పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులను చదువులో ప్రోత్సహించేందుకు 2008లో అప్పటి కేంద్రప్రభుత్వం నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ స్కీం(ఎన్ఎంఎంఎస్)ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద స్కాలర్షిప్లు అందించడానికి జిల్లా కేంద్రంలో ప్రతి సంవత్సరం నవంబర్లో ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థులకు ప్రతిభ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులను స్కాలర్షిప్కు ఎంపిక చేస్తున్నారు. ప్రతిభ పురస్కారానికి ఎంపికైన విద్యార్థులకు మరుసటి సంవత్సరం నుంచి అంటే 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ పూర్తయ్యే వరకు సంవత్సరానికి రూ. 6 వేల చొప్పున నాలుగేళ్ల పాటు స్కాలర్షిప్ విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఇందుకోసం విద్యార్థి బ్యాంకులో ఖాతా తీయాలి. ప్రభుత్వమే నేరుగా విద్యార్థి ఖాతాలో ప్రతి విద్యా సంవత్సరంలో జూన్ నెల నుంచి డిసెంబర్ నెలాఖరులోగా రూ. 6 వేలను ఖాతాలో జమ చేస్తారు. మండలంలో పరిస్థితి ఇదీ.. కమ్మర్పల్లి మండలంలో 8 ఉన్నత పాఠశాలలున్నాయి. 2009 నుంచి ఇప్పటి వరకు 64 మంది ఎంపికయ్యారు. అయితే గడిచిన రెండేళ్ల నుంచి అంటే 2014-15, 2015-16 సంవత్సరాలకు సంబంధించి స్కాలర్షిప్ డబ్బులు వారి ఖాతాల్లో జమ కావడం లేదు. ఇందులో 2013 సంవత్సరం వరకు స్కాలర్షిప్లు గత జూలై 2015లో అందాయి. 2014 సంవత్సరం నుంచి విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని విద్యార్థులు తెలిపారు. కొంతమందికి 2010లో కూడా డబ్బులు జమ కాలేవన్నారు. రెండు మూడేళ్లకోసారి ఒక ఏడాదివి (రూ. 6 వేలు) మాత్రమే వస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. మరికొంత మందికి అసలే రాలేవన్నారు. స్కాలర్షిప్ విషయమై 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులు తమ ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకువచ్చినా, డీఈఓ కార్యాలయంలో తెలుసుకోవాలంటూ ఇప్పటి వరకు సమాధానం దాటవేస్తూ వచ్చారు. ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలకు వెళ్లి స్కాలర్ షిప్ గురించి ఆరా తీసినా ఫలితం లేకుండాపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి స్కాలర్షిప్లు అందేలా చూడాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. రెండేళ్ల నుంచి రావడం లేదు కమ్మర్పల్లి పాఠశాలలో టెన్త్ వరకు చదివాను. ఎనిమిదో తరగతిలో స్కాలర్షిప్ పరీక్ష రాసి ఎంపికయ్యాను. 2013 స్కాలర్షిప్ డబ్బు లు 2015 జూలైలో వచ్చాయి. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ అయిపోయింది. రెండేళ్లది కలిపి రూ. 12 వేలు స్కాలర్ షిప్ రావాలి. -ఉట్నూర్ శాంతిప్రియ, ఇంటర్మీడియెట్ సెకండియర్, కమ్మర్పల్లి సార్లు తెలియదంటున్నారు 8వ తరగతిలో ఉన్నప్పుడు(2011లో) పరీక్ష రాసి స్కాలర్షిప్కు ఎంపికయ్యాను. 9వ తరగతి నుంచి డబ్బులు వస్తాయన్నారు. రెండేళ్లవి మాత్రమే రూ. 12 వేలు మాత్రమే వచ్చాయి. సార్లను అడిగితే తెలియదంటున్నారు. అధికారులు స్పందించి స్కాలర్ షిప్ డబ్బులు త్వరగా అందేటా చూడాలి. - రాజేందర్, ఇంటర్మీడియెట్, కమ్మర్పల్లి మంజూరు చేయాలి స్కాలర్షిప్కు ఎంపికైన నాటి నుంచి స్కాలర్ షిప్ డబ్బులు సక్రమంగా రావడం లేదు. ఎవరిని అడగాలో తెలియడం లేదు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ పూర్తి చేశాను. రెండేళ్ల స్కాలర్షిప్ రూ. 12 వేలు రావాలి. అధికారులు స్పందించి వెంటనే మంజూరు చేయాలి. - కొంటికంటి అంజలి, ఇండర్మీడియెట్, కమ్మర్పల్లి