‘వ్యాట్’లో ఎక్సైజ్‌దే అధిక వాటా | Exice incomes shares high in VAT | Sakshi
Sakshi News home page

‘వ్యాట్’లో ఎక్సైజ్‌దే అధిక వాటా

Published Mon, Sep 15 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM

Exice incomes shares high in VAT

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న కీలక శాఖల్లో ఎక్సైజ్ కూడా ఒకటి. అయితే దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నుల విధానం కింద జీఎస్‌టీ అమలుచేస్తే ఈ శాఖ నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి భారీగా గండి పడనుంది. అందువల్లే జీఎస్‌టీ నుంచి ఎక్సైజ్ ఆదాయాన్ని మినహాయించాలని కేంద్రానికి టీ సర్కారు స్పష్టంచేసింది. వాస్తవానికి రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖకు ఏటా సమకూరుతున్న ఆదాయంలో ఎక్సైజ్ జమ చేస్తున్న ‘వ్యాట్ బై ఎక్సైజ్’ అకౌంటే 20 శాతానికి పైగా ఉంది. 
 
మద్యం అమ్మకాలపై 75 శాతానికి పైగా వ్యాట్ రూపంలో పన్ను వసూలు చేస్తున్న నేపథ్యంలో జీఎస్‌టీ అమలైతే ఈ ఆదాయం నేరుగా కేంద్రం ఖాతాలోకే వెళుతుంది. వ్యాట్‌లో రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఇవ్వకుండా 2 శాతం సీఎస్‌టీతోనే సరిపుచ్చుకోమంటున్న నేపథ్యంలో కేంద్రం జీఎస్‌టీని ఆచరణలోకి తెస్తే సీఎస్‌టీ ఆదాయాన్ని కూడా రాష్ట్రాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పటికే వ్యాట్ బకాయిల కింద కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రూ.5వేల కోట్లకు పైగా రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లోనే గత బుధవారం ఢిల్లీలో 14వ ఆర్థిక సంఘంతో జరిగిన ఆర్థిక మంత్రుల సమావేశంలో రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్.. ఎక్సైజ్ పన్నులను రాష్ట్రానికే వదిలేయాలని స్పష్టంచేశారు.
 
 ఐదు నెలల వాటా రూ. 2,890 కోట్లు
 తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ విధానం జూలై నుంచి అమలవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదలైన ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ. 4,350 కోట్లు ఎక్సైజ్ ఆదాయంగా సమకూరింది. ఇందులో వ్యాట్ బై ఎక్సైజ్ కింద వాణిజ్య పన్నుల శాఖకు నేరుగా సమకూరిన విలువ ఆధారిత పన్ను రూ. 2,890 కోట్లు. మిగతా రూ.1,460 కోట్లు మాత్రమే ఎక్సైజ్ శాఖ నికర ఆదాయం అన్నమాట. జూలైలో లెసైన్స్ ఫీజులతో కలిపి రూ.1,024 కోట్ల ఆదాయం సమకూరగా, అందులో వ్యాట్ కింద వాణిజ్య పన్నుల శాఖకు చేరిన మొత్తం ఏకంగా రూ.734 కోట్లు. అంటే వచ్చిన ఆదాయంలో 71 శాతం పన్ను రూపంలోనే వెళుతుంది. ఇంత మొత్తాన్ని కేంద్రానికి వదులుకునేందుకు సిద్ధంగా లేకపోవడం వల్లే ఎక్సైజ్ ఆదాయాన్ని జీఎస్‌టీ నుంచి మినహాయించాలని 14వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
 
 ఎక్సైజ్ శాఖకు దక్కుతోంది స్వల్పమే...
 వ్యాట్ అమల్లోకి వచ్చాక 2005-2011 మధ్యకాలంలో మద్యం అమ్మకాల ద్వారా సమకూరిన ఆదాయం నుంచి ఎక్సైజ్ శాఖ వ్యాట్ కింద వాణిజ్యపన్నుల శాఖకు పన్ను చెల్లించేది. అయితే 2012 నుంచి మద్యం అమ్మకాలపై వచ్చిన మొత్తం ఎప్పటికప్పుడు నేరుగా వాణిజ్యపన్నుల శాఖ ఖాతాలోకి చేరేలా మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో రాబడి భారీగా కని పించినా, మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్ శాఖకు 30 శాతం నుంచి 40 శాతమే దక్కుతోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖకు మద్యం అమ్మకాల ద్వారా రూ.20,250 కోట్లు రాగా, అందులో రూ.13,500 కోట్లు ‘వ్యాట్ బై ఎక్సైజ్’ ఖాతాలోకే చేరాయి. మిగిలిన రూ.6,750 కోట్లలో రూ.500 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్‌కు చేరగా, నికరంగా ఎక్సైజ్‌కు దక్కింది రూ.6,250 కోట్లే. ఇప్పుడు టీ ఎక్సైజ్‌శాఖ రూ.11వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇందులో వ్యాట్ బై ఎక్సైజ్ కింద వెళ్లే పన్ను మినహాయిస్తే కేవలం రూ. 3వేల కోట్లే మిగులుతుంది. అందువల్ల జీఎస్‌టీ నుంచి ఎక్సైజ్ శాఖను మినహాయిస్తే మొత్తం రూ.11వేల కోట్లు రాష్ట్రానికే దక్కుతుందని ప్రభుత్వ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement