జీఎస్‌టీ షురూ..
♦ అమల్లోకి వచ్చిన నూతన విధానం
♦ పన్నులపై వినియోగదారుల ఆరా
♦ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల్లో సదస్సులు
సాక్షి, వరంగల్ రూరల్: జీఎస్‌టీ అమలు విధానం ప్రారంభమైంది. నిన్నటి వరకు విలువ ఆధారిత పన్ను(వ్యాట్), టర్నోవర్ ట్యాక్స్, వినోదపు పన్ను, లగ్జరీ ట్యాక్స్ రూపంలో రాష్ట్రం, సెంట్రల్ ఎక్సైజ్, అడిషనల్ సెంట్రల్ ఎక్సైజ్, సర్వీసు ట్యాక్స్ రూపంలో కేంద్రప్రభుత్వం పన్నులు వసూలు చేసేవి. అయితే ఈ పన్నులన్నీ రద్దయి వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అమలులోకి వచ్చింది. దేశ వాణిజ్య విధానం ఇన్నాళ్లు వేర్వేరుగా ఉండేది. ఇప్పుడు జీఎస్‌టీ అమలులోకి రావడంతో ఆ పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నా రు. పన్నుల విధానాన్ని ఏడు రకాలుగా విభజించారు. దీంతో శనివారం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వ్యాపార సంస్థల యాజమాన్యాలు జీఎస్‌టీ పన్నుతో కూడిన బిల్లులను వినియోగదారులకు అందించారు. ఇక వినియోగదారులు తమపై ఎంత మేరకు జీఎస్‌టీ భారం పడుతుందని ఆసక్తిగా తెలుసుకోవడం కనిపించింది.
కార్యాలయాల్లో..
జిల్లా వ్యాప్తంగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖల సర్కిల్ కార్యాలయాల్లో అధికారులు జీఎస్‌టీకి స్వాగతం పలుకుతూ శనివారం కేక్ కట్ చేశారు. ఆ తర్వాత వివిధ వ్యాపార సంస్థల డీలర్లు, సిబ్బందితో సమావేశం అయ్యారు. జీఎస్‌టీపై వారికి అవగాహన కల్పించడంతో పాటు పలు సూచనలు చేశారు. జీఎస్‌టీ కొత్త నిబంధనలను వివరించారు.
సీటీఓ ఆఫీస్‌లో..
కరీమాబాద్: ‘ఒక దేశం, ఒక పన్ను, ఒక మార్కెట్..’ విధానంతో దేశ చరిత్రలో ప్రతిష్టాత్మక గూడ్స్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్‌టీ) శనివారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు వరంగల్ హంటర్‌రోడ్డులోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం(సీటీఓ)లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఏసీ, సీటీఓ నేహా కేక్ కట్ చేసి ఉద్యోగులు, డీలర్లకు అందజేశారు. కార్యక్రమంలో సీటీఓలు, ఏసీటీఓలు, డీసీటీఓలతో పాటు వివిధ వ్యాపార సంస్థల డీలర్లు పాల్గొన్నారు.