వివరాలు వెల్లడిస్తున్న జేసీ శ్రీనివాసరావు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డివిజన్‌లో భారీ జీఎస్టీ మోసాన్ని రాష్ట్ర పన్నుల శాఖ బట్టబయలు చేసింది. రూ.వందల కోట్ల ఆదాయాన్ని ఆర్జించి.. ఒక్క రూపాయి కూడా జీఎస్టీ రిటరŠన్స్ చెల్లించకుండా శ్రీపాద్ ఇన్‌ఫ్రా కంపెనీ రూ.69.06 కోట్లు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ జాయింట్ కమిషనర్ నక్కు శ్రీనివాసరావు తెలిపారు. శనివారం జీఎస్టీ విశాఖ డివిజన్ కార్యాలయంలో ఈ వివరాలను విలేకరులకు వెల్లడించారు. 2006లో యశ్వంత్ ఎంటర్‌ప్రైజెస్‌గా ప్రస్థానం ప్రారంభించి 2010లో యశ్వంత్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, 2012లో వైఈపీఎల్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గానూ, 2016 జూన్ 27న శ్రీపాద్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌గా పేర్లు మారుస్తూ వ్యాపార లావాదేవీలు సాగించారు. కంపెనీ ఎండీగా గొలుగూరి శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్‌గా సూర శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్న ఈ కంపెనీ.. వ్యాట్ చట్టంలో రిజిస్ట్రేషన్ చేయకుండానే నడిపించేశారు. జీఎస్టీ చట్టం వచ్చాక 2019 జూలై 7న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2019 జనవరిలో రిటర్న్స్–3బీ దాఖలు చేసి జీరో టర్నోవర్ కంపెనీగా చూపించారు. వరుసగా ఆరు నెలలు రిటరŠన్స్ దాఖలు చేయకపోవడంతో రిజిస్ట్రేషన్ రద్దయింది. అయినా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చూపిస్తూ ప్రాజెక్టులు దక్కించుకొని లావాదేవీలు సాగించారు.
విస్తుపోయే నిజాలు..
శ్రీపాద్ ఇన్‌ఫ్రా గురించి జీఎస్టీ అధికారులకు సమాచారం రావడంతో పదిరోజులుగా రెక్కీ నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం సీతమ్మధారలో సంస్థ కార్యాలయాన్ని గుర్తించి.. రికార్డులు పరిశీలించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 2016–17లో రూ.75.94 కోట్లు, 2017–18లో రూ.92.04 కోట్లు, 2018–19లో రూ.122.87 కోట్లు, 2019–20లో రూ.147.44 కోట్ల చొప్పున మొత్తం నాలుగేళ్ల కాలంలో రూ.438.29 కోట్లు వ్యాపారం ద్వారా ఆర్జించినట్లు గుర్తించారు. నాలుగేళ్లలో మొత్తం రూ.385.33 కోట్లు రియల్ వ్యాపారానికి సంబంధించిన కొనుగోళ్లు చేసినట్లు అధికారులు గుర్తించారు.
గడువులోగా జీఎస్టీ చెల్లించకుంటే కస్టడీకి..
ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసినా.. ఒక్క పైసా కూడా జీఎస్టీ చెల్లించకపోవడం దక్షిణ భారతదేశంలో ఇదే ప్రప్రథమమని జాయింట్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. జీఎస్టీ ప్రకారం రూ.69,06,85,140 పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేశామని, నిర్ణీత గడువులోపు పన్నులు చెల్లించకపోతే ఎండీ, డైరెక్టర్లను కస్టడీలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎండీ శ్రీనివాసరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించగా ఆదాయపు పన్ను రిటర్న్స్, సీఏతో ధ్రువీకరించిన బ్యాలెన్స్ షీట్లు, ప్రాఫిట్స్, లాస్ అకౌంట్లు గుర్తించి వాటన్నింటినీ సీజ్ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment