శ్రీశైలంపై జీఎస్టీ పిడుగు! | gst thunderbolt on srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంపై జీఎస్టీ పిడుగు!

Published Sat, Jun 17 2017 10:24 PM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

శ్రీశైలంపై జీఎస్టీ పిడుగు!

శ్రీశైలంపై జీఎస్టీ పిడుగు!

· దేవస్థానానికి వచ్చే రాబడి, వసూళ్లపై ట్యాక్స్‌ ?
· అన్నదాన నిర్వహణ, ఉచిత ప్రసాదాలపై ప్రభావం
· ముడిసరుకులు, ఇతరత్రా కోసం
  ఏటా రూ. 25కోట్లకు పైగా కొనుగోళ్లు
· ఇప్పటి వరకు వ్యాట్‌ ద్వారా మినహాయింపు 
· జీఎస్టీ వస్తే ట్యాక్స్‌ కట్టాల్సిందే
· ప్రత్యేక దర్శన, ఆర్జితసేవా టికెట్లపై కూడా పన్ను 
· దేవస్థానాలకు  జీఎస్టీ నుంచి మినహాయింపు లేదన్న ఆర్థిక మంత్రి జైట్లీ
 
శ్రీశైలం: జీఎస్టీ (వస్తుసేవల పన్ను) భారం శ్రీశైల దేవస్థానంపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుమల తిరపతి దేవస్థానం తరువాత అత్యధిక ఆదాయం కలిగిన క్షేత్రంగా శ్రీశైలం పేరొందింది. ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాబడి, ఆదాయం.. తదితర వాటిపై పన్ను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడితే అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. వ్యాట్‌ (వ్యాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌) చట్టం.. 2003లో అమలులోకి వచ్చింది. అయితే మతపరమైన ధార్మిక సంస్థలకు పన్ను మినహాయింపును ఇచ్చారు. దీంతో ఆయా దేవస్థానాలకు పన్ను కట్టాల్సిన భారం లేకుండా పోయింది. అయితే జూలై నుంచి అమలులోకి వస్తుందనుకుంటున్న జీఎస్టీపై గత ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ..వివరణ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఇతర ఏ దేవస్థానాలకు కూడా పన్ను కట్టే విషయంలో సడలింపు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. జీఎస్టీ అమలులోకి వస్తే అన్ని దేవస్థానాలు, తప్పనిసరిగా పన్నులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల రాబడి తగ్గడంతో పాటు అదనపు ఆదాయం కోసం ఆ భారాన్ని భక్తులపై వేసే అవకాశం కూడా కనిపిస్తోంది.
 
దర్శన ఆర్జితసేవలపై..
ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక, అతిశీఘ్ర దర్శనాలు, అభిషేకాది ఆర్జిత సేవా టికెట్లపై కూడా జీఎస్టీ బాదుడు కనిపించనుంది. గత ఏడాది మల్లన్న అభిషేకాది ఆర్జితసేవలు, ఇతర పూజలు, వ్రతాలు, కల్యాణోత్సవం.. తదితర వాటిపై రూ. 58 కోట్లకు పైగా ఆదాయం లభించింది. అలాగే దేవస్థానం భక్తుల సౌకర్యం కోసం నిర్మించిన వసతి గదులు, సత్రాలు, కాటేజీలు, ఇతర భవనాల అద్దె మొదలైన వాటి ద్వారా 2016–17 సంవత్సరంలో సుమారు రూ. 6.50 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఇవే కాకుండా దేవస్థానం టోల్‌గేట్, తలనీలాల వేలాలు, కొబ్బరి చిప్పల విక్రయం, దుకాణాల అద్దెలు మొదలైన వాటి ద్వారా రూ. 13 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. వార్షికంగా శ్రీశైల దేవస్థానానికి పలు మార్గాల ద్వారా గత ఏడాది రూ. 250 కోట్లకు పైగా రాబడి లభించింది. దాతలు ఇచ్చే విరాళాలు.. ఇంకా ఎన్నో మార్గాల ద్వారా వచ్చే రాబడిపై జీఎస్టీ భారం పడితే కనీసం 12 శాతం నుంచి గరిష్టంగా 18 శాతం వరకు దేవస్థానం పన్ను చెల్లించాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
ఉచిత భోజన పథకానికి కష్టాలు..
దేవస్థానం ఎన్నో ఏళ్లుగా ఉచిత భోజన పథకాన్ని అమలు చేస్తోంది. దాతల విరాళాలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో ఉంచి వాటి ద్వారా వచ్చే వడ్డీతో అన్నదానాన్ని నిర్వహిస్తోంది.  ఇందుకోసం ముడిసరుకులైన కాయగూరలు, పాలు, పెరుగు, నెయ్యి,  వంటగ్యాస్‌ తదితరాలకు.. రూ. కోట్లలో ఖర్చు చేస్తోంది. గత ఏడాది రూ.5.32 కోట్లకు పైగా వ్యయం చేసింది. జీఎస్టీ  అమలైతే ఆయా ముడి సరుకులను బట్టి 12 శాతం నుంచి  సుమారు 28 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంది. దీంతో ఉచిత భోజన పథాకానికి కష్టాలు వచ్చినట్లేనని అంటున్నారు. 
 
మల్లన్న ప్రసాదాలపై..
 శ్రీశైల దేవస్థానం.. లాభాపేక్ష లేకుండా నష్టాలను భరిస్తూనే భక్తులకు నాణ్యమైన లడ్డూ ప్రసాదాలను అందజేస్తోంది. ఇందు కోసం గత ఏడాది రూ.18 కోట్ల వరకు ముడిసరుకులను కొనుగోలు చేశారు. ఇతర ఆర్జితసేవలు, పూజా సామగ్రి, ప్రసాద వితరణ కోసం సుమారు రూ. 2.60 కోట్లకు పైగా వ్యయం చేశారు. వీటన్నింటిపై కూడా ట్యాక్స్‌ పడితే ప్రసాదాల నిర్వహణ ఎలా అనే విషయంపై దేవస్థానం ఇప్పటికే ఆలోచనలో పడింది. 
 
 పూర్తిస్థాయిలో సమాలోచన చేస్తున్నాం:  నారాయణ భరత్‌గుప్త, ఈఓ
వచ్చే నెల నుంచి అమలు కానున్న జీఎస్టీ విషయంలో ఉన్నతస్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయి. లాభనష్టాలతో సంబంధం లేకుండా భక్తుల సౌకర్యం కోసం నిర్వహించే పథకాల అమలు విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటాం. జీఎస్టీ, ఇతర ఆర్థిక వ్యవహరాల పర్యవేక్షణకై చీఫ్‌ ఫైనాన్సియర్‌ అడ్వైజర్‌ను శ్రీశైలదేవస్థానంలో నియమించుకున్నాం. జీఎస్టీ చట్టాన్ని అనుసరించి  విధి విధానాలను రూపొందించే ప్రయత్నంలో ఉన్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement