ఎంసెట్ కౌన్సెలింగ్ గడువు పెంచండి
Published Sat, Jul 12 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM
సుప్రీంలో టీ సర్కారు పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన ఎంసెట్ కౌన్సెలింగ్ గడువు పెంచాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణలో సరిపడా సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లేనందున ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియను సక్రమంగా నిర్వహించలేమని.. అడ్మిషన్ల ప్రక్రియకు అక్టోబర్ 31 వరకు గడువు ఇవ్వాలని అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే గతంలో అడ్మిషన్ల కోసం నిర్దిష్ట గడువును నిర్దేశించింది సుప్రీంకోర్టే కాబట్టి.. ఇప్పుడు ఈ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
నెలాఖరులో కౌన్సెలింగ్?: మరోవైపు అధికారులు మాత్రం ఎంసెట్ కౌన్సెలింగ్‌ను
ఈ నెలాఖరులో ప్రారంభించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. వారం రోజుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున.. వెంటనే ఎంసెట్ కౌన్సెలింగ్‌పై దృష్టిసారించనున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 20వ తేదీ నాటికి ప్రవేశాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయితే.. కౌన్సెలింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు వీలుంటుంది. అనంతరం వారం గడువు ఇచ్చి ధ్రువపత్రాల పరిశీలన, ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించవచ్చునని భావిస్తున్నారు.
Advertisement