EMCET Councelling
-
ఎంసెట్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ మార్కులు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా వైరస్ కారణంగా ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనల ప్రకారం.. ఎంసెట్ పరీక్ష రాయాలంటే ఇంటర్లో కనీసం 45శాతం మార్కులు సాధించి ఉండాలి. అయితే ప్రభుత్వం మాత్రం పాస్ మార్కులతో పరీక్షలు లేకుండానే ఫలితాలు విడుదల చేసింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. ఇంటర్ వెయిటేజ్ మార్కులను తొలగించాలని కోరారు. పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని జేఎన్టీయూని ఆదేశించింది. ఈ క్రమంలోనే విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సానుకూలంగా స్పందించిన సర్కార్.. ఎంసెట్ నిబంధనలను సవరిస్తూ గురవారం జీవో జారీచేసింది. ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ మార్కులు తొలగిస్తూ తెలంగాణ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించి ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు లబ్ధిపొందనున్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులు ఎవరైనా ఎంసెట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విధంగా విద్యాశాఖ వెసులుబాటు కల్పించింది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 4.11 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ,బైపీసీ విద్యార్థులు 2,83,631 మంది ఉన్నారు. ఇందులో 1.75లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే ఎంసెట్‌కు కావాల్సిన 45శాతం కనీస మార్కులు పొందనివారికి... అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రూపంలో మరో అవకాశం ఉండేది. అందులో స్కోర్ పెంచుకుంటే ఆ తర్వాత ఎంసెట్‌కు అర్హత సాధించేవారు. కానీ ఈసారి ప్రభుత్వం కనీస మార్కులు 35తో ఫెయిలైనవారిని పాస్ చేయడంతో చాలామంది ఎంసెట్‌కు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం తాజా నిర్ణయంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
రేపటి నుంచి ఏపీ ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్
సాక్షి, అమరావతి : రేపటి నుంచి ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి వెబ్ కౌన్సిలింగ్ జరగనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆన్లైన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఏర్పాట్లు చేశారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో వెబ్ కౌన్సిలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేయగా, గిరిజన విద్యార్ధుల కోసం తొలిసారిగా పాడేరులో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. రేపు (అక్టోబర్ 23)న ఒకటో ర్యాంక్ నుంచి 20వేల వరకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనుండగా, 24న 20,001 ర్యాంక్ నుంచి 50వేల వరకు 25న 50,001 ర్యాంక్ నుంచి 80వేల వరకు 26న 80,001 ర్యాంక్ నుంచి 1.10లక్షల వరకు 27న 1,10,001 నుంచి చివరి ర్యాంక్ వరకు వెబ్ కౌన్సిలింగ్ జరగనుంది. -
జేఎన్టీయూహెచ్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకులు రాని అభ్యర్థులు జేఎన్టీయూహెచ్ దగ్గర క్యూ కట్టారు. రేపటి నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుండటంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళలో ఉన్నారు. టీఎస్ ఎంసెట్ కార్యాలయంలో విద్యార్థులు తమ ఫోటో కాపీలు సమర్పిస్తున్నారు. కౌన్సిలింగ్ ఉన్న నేపథ్యంలో రేపటి లోగా ర్యాంకు కేటాయించక పోతే ఎలా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అక్నాలెడ్జ్మెంట్ కాపీలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుండటంతో జేఎన్టీయూహెచ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 1,43,330 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 1,19,187 మంది (83.16 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 9వ తేదీ నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ తరువాత రెండు మూడుల్లో వారి ఫలితాలను విడుదల చేయనుంది. ఇక గత నెల 28, 29 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్ ఎంసెట్ ఫలితాలను కూడా వచ్చే వారంలో విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. -
‘విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్’
సాక్షి, అమరావతి : తాము గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను మంత్రి సురేష్ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శనివారం నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ మొదలుపెట్టి, ఆగష్టు 5వ తేది నుంచి తరగతులు ప్రారంభం చేయనునట్లు వెల్లడించారు. ఎన్నికల హామీలో ఇచ్చిన మాటకు సీఎం జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. దీనిపై శాసనసభలో కూడా రెండు ప్రత్యేక చట్టాలను ప్రవేశ పెట్టామని, నాణ్యమైన విద్యను పేదలకు అందించేందుకు ఈ చట్టాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫీజుల నియంత్రణ, విద్య ప్రమాణాలను పాటించేలా రేగ్యులటరీ కమిషన్లను ఏర్పాటు చేసేలా చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ కమిషన్ల నిర్వహణ బాధ్యతను విశ్రాంత న్యాయమూర్తికి అప్పగిస్తామని తెలిపారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ ను 31లోగా ముగించాలి
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు స్పష్టీకరణ అక్టోబర్ చివరి వరకు గడువు ఇవ్వాలన్న టీ-సర్కారు వినతికి నిరాకరణ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే అడ్మిషన్లు నిర్వహించాలని ఉద్ఘాటన ఫీజులు, స్థానికత జోలికి వెళ్లని ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ తదితర వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఎంసెట్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ నెల 31 లోపు పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇందుకు అక్టోబర్ 31 వరకు గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. కౌన్సెలింగ్ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నిర్వహించాలని తుది ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. తెలంగాణ ప్రభుత్వం గడువు పొడిగింపు కోరుతూ వేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ సుదాంశు జ్యోతి ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసం విచారణ చేపట్టింది. గత సోమవారం ఈ కేసు విచారణ సందర్భంగా ఆగస్టు 31 లోగా కౌన్సెలింగ్ నిర్వహించుకునేందుకు గడువు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం.. ఇవే ఆదేశాలను తుది తీర్పులోనూ పేర్కొంది. మళ్లీ కొత్తగా గడువు ఏమిటి? సోమవారం ఈ కేసు విచారణకు రాగానే జస్టిస్ ముఖోపాధ్యాయ ‘‘మేం ఈ కేసులో స్థానికత విషయంలోకి వెళ్లడం లేదు. కౌన్సెలింగ్ పూర్తిచేయడానికి ఆగస్టు 31 వరకు గడువు ఇస్తున్నాం. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా?’’ అని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ తరఫు న్యాయవాది, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. అక్టోబర్ 31 వరకు గడువు ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ ‘‘గత వారం మీరు లేరా? గత వారం మీ న్యాయవాది ఎవరు?’’ అని ప్రశ్నించారు. రామకృష్ణారెడ్డి బదులిస్తూ.. ‘‘గత వారం హరీష్‌సాల్వే ఉన్నారు. ఆ సమయంలో నేను కూడా ఉన్నాను. అయితే మరి కొంత సమయం మాకు కావాల్సి ఉంది..’’ అని విన్నవించారు. న్యాయమూర్తి జోక్యంచేసుకుని ‘‘గత వారమే ఆగస్టు 31 వరకు గడువు ఇస్తామని చెప్పినప్పుడు సాల్వే ఒప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా గడువు ఏమిటి? అక్టోబర్ 31 వరకు గడువు అడిగితే మాత్రం నేను ఈ పిటిషన్నే తిరస్కరిస్తాను...’’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రం ఏర్పడగానే ఇన్ని సమస్యలా? అదే విధంగా ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను న్యాయమూర్తి ప్రశ్నించారు. తాము మధ్యంతర దరఖాస్తు సమర్పించామని న్యాయవాదులు చెప్పగా అది తమ వద్దకు రాలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంలో తెలంగాణ తరఫు న్యాయవాదులు రెండు ప్రభుత్వాల అంగీకారం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చారంటూ వాదనలు వినిపించబోగా.. న్యాయమూర్తి జస్టిస్ ముఖోపాధ్యాయ ‘‘ఎంత మంది వాదిస్తారు? ముగ్గురు వాదిస్తే ఎలా? చిన్న రాష్ట్రానికి ముగ్గురు న్యాయవాదులు వాదిస్తారా? రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే ఇన్ని సమస్యలా?’’ అని వ్యాఖ్యానించారు. ‘‘నేను జార్ఖండ్ వాసినని బీహార్ ప్రభుత్వం అంటుంది. బీహార్ వాసినని జార్ఖండ్ ప్రభుత్వం అంటుంది.. చివరకు నాకు నేను భారతీయుడినని నిర్ణయించుకుని ఆ రకంగానే సెటిల్ అయిపోయాను...’’ అని రాష్ట్ర విభజనలో తన అనుభవాన్ని తెలిపారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే... న్యాయమూర్తి తుదిగా ఆదేశాలు ఇస్తూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 ప్రకారం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇంజనీరింగ్ అడ్మిషన్లను జూలై 31 లోపు నిర్వహించాల్సి ఉంది. అయితే అడ్మిషన్ల నిర్వహణకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో విధివిధానాలను రూపొందించుకునేందుకు సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం అడిగింది. తగినంత సిబ్బంది లేరని విన్నవించింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి సైతం ఇదే విజ్ఞాపన చేసింది. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆగస్టు 31 వరకు గడువు పొడిగిస్తున్నాం...’’ అని ఆదేశాలు జారీచేశారు. స్థానికత గురించి ఏపీ తరఫు న్యాయవాదులు ప్రస్తావించగా.. ‘‘అడ్మిషన్లను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 కు లోబడి చేపట్టాలి’’ అని న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంలో ఏపీ సర్కారు తరఫు న్యాయవాది పి.పి.రావు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేసింది. అడ్మిషన్ల నిర్వహణలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వగలరు...’’ అని కోరారు. ‘‘పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకరామే నిర్వహించాలి’’ అని న్యాయమూర్తి పునరుద్ఘాటించారు. అంతకుముందు ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై ఏపీ సర్కారు తరఫు న్యాయవాదులు ప్రస్తావించగా.. ‘‘ఇది దానికి సంబంధించిన కేసు కాదు.. దాని గురించి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం...’’ అని న్యాయమూర్తి స్పందించారు. అడ్మిషన్ల అధికారం ఏపీ ఉన్నత విద్యామండలిదే: ఏపీ న్యాయవాది కేసు విచారణ అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘అక్టోబరు 31 వరకు గడువు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆగస్టు 31 లోపే అడ్మిషన్లు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం అడ్మిషన్లు నిర్వహించాలి. ఆ చట్టం ప్రకారమే అడ్మిషన్లు నిర్వహించాలని కోర్టు స్పష్టంచేసింది...’’ అని వివరించారు. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలులో ఉన్న అడ్మిషన్ల ప్రక్రియ, కోటాలు.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ పదేళ్ల పాటు అమలులో ఉంటాయని పునర్వ్యవస్థీకరణ చట్టం చెప్తోందని ఆయన గుర్తుచేశారు. అలాగే.. ఆ చట్టం ప్రకారం.. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించే అధికారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలిదేనని పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారమే అడ్మిషన్లను నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని చెప్పారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ గడువు పెంచండి!
సుప్రీంలో టీ సర్కారు పిటిషన్ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన ఎంసెట్ కౌన్సెలింగ్ గడువు పెంచాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణలో సరిపడా సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లేనందున ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియను సక్రమంగా నిర్వహించలేమని.. అడ్మిషన్ల ప్రక్రియకు అక్టోబర్ 31 వరకు గడువు ఇవ్వాలని అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే గతంలో అడ్మిషన్ల కోసం నిర్దిష్ట గడువును నిర్దేశించింది సుప్రీంకోర్టే కాబట్టి.. ఇప్పుడు ఈ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి. నెలాఖరులో కౌన్సెలింగ్?: మరోవైపు అధికారులు మాత్రం ఎంసెట్ కౌన్సెలింగ్‌ను ఈ నెలాఖరులో ప్రారంభించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. వారం రోజుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున.. వెంటనే ఎంసెట్ కౌన్సెలింగ్‌పై దృష్టిసారించనున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 20వ తేదీ నాటికి ప్రవేశాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయితే.. కౌన్సెలింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు వీలుంటుంది. అనంతరం వారం గడువు ఇచ్చి ధ్రువపత్రాల పరిశీలన, ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించవచ్చునని భావిస్తున్నారు.