ఎంసెట్ కౌన్సెలింగ్ ను 31లోగా ముగించాలి | Process of EMCET councelling must finish before August 31st | Sakshi
Sakshi News home page

ఎంసెట్ కౌన్సెలింగ్ ను 31లోగా ముగించాలి

Published Tue, Aug 12 2014 1:03 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

ఎంసెట్ కౌన్సెలింగ్ ను 31లోగా ముగించాలి - Sakshi

ఎంసెట్ కౌన్సెలింగ్ ను 31లోగా ముగించాలి

  • ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
  •   అక్టోబర్ చివరి వరకు గడువు
  •  ఇవ్వాలన్న టీ-సర్కారు వినతికి నిరాకరణ 
  •  పునర్‌వ్యవస్థీకరణ చట్టం
  •  ప్రకారమే అడ్మిషన్లు నిర్వహించాలని ఉద్ఘాటన 
  •  ఫీజులు, స్థానికత జోలికి వెళ్లని ధర్మాసనం
  •  
     సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ తదితర వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఎంసెట్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ నెల 31 లోపు పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇందుకు అక్టోబర్ 31 వరకు గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. కౌన్సెలింగ్ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నిర్వహించాలని తుది ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. తెలంగాణ ప్రభుత్వం గడువు పొడిగింపు కోరుతూ వేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ సుదాంశు జ్యోతి ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసం విచారణ చేపట్టింది. గత సోమవారం ఈ కేసు విచారణ సందర్భంగా ఆగస్టు 31 లోగా కౌన్సెలింగ్ నిర్వహించుకునేందుకు గడువు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం.. ఇవే ఆదేశాలను తుది తీర్పులోనూ పేర్కొంది. 
     
     మళ్లీ కొత్తగా గడువు ఏమిటి?
     సోమవారం ఈ కేసు విచారణకు రాగానే జస్టిస్ ముఖోపాధ్యాయ ‘‘మేం ఈ కేసులో స్థానికత విషయంలోకి వెళ్లడం లేదు. కౌన్సెలింగ్ పూర్తిచేయడానికి ఆగస్టు 31 వరకు గడువు ఇస్తున్నాం. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా?’’ అని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ తరఫు న్యాయవాది, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. అక్టోబర్ 31 వరకు గడువు ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ ‘‘గత వారం మీరు లేరా? గత వారం మీ న్యాయవాది ఎవరు?’’ అని ప్రశ్నించారు. రామకృష్ణారెడ్డి బదులిస్తూ.. ‘‘గత వారం హరీష్‌సాల్వే ఉన్నారు. ఆ సమయంలో నేను కూడా ఉన్నాను. అయితే మరి కొంత సమయం మాకు కావాల్సి ఉంది..’’ అని విన్నవించారు. న్యాయమూర్తి జోక్యంచేసుకుని ‘‘గత వారమే ఆగస్టు 31 వరకు గడువు ఇస్తామని చెప్పినప్పుడు సాల్వే ఒప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా గడువు ఏమిటి? అక్టోబర్ 31 వరకు గడువు అడిగితే మాత్రం నేను ఈ పిటిషన్‌నే తిరస్కరిస్తాను...’’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 
     
     రాష్ట్రం ఏర్పడగానే ఇన్ని సమస్యలా?
     అదే విధంగా ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను న్యాయమూర్తి ప్రశ్నించారు. తాము మధ్యంతర దరఖాస్తు సమర్పించామని న్యాయవాదులు చెప్పగా అది తమ వద్దకు రాలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంలో తెలంగాణ తరఫు న్యాయవాదులు రెండు ప్రభుత్వాల అంగీకారం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చారంటూ వాదనలు వినిపించబోగా.. న్యాయమూర్తి జస్టిస్ ముఖోపాధ్యాయ ‘‘ఎంత మంది వాదిస్తారు? ముగ్గురు వాదిస్తే ఎలా? చిన్న రాష్ట్రానికి ముగ్గురు న్యాయవాదులు వాదిస్తారా? రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే ఇన్ని సమస్యలా?’’ అని వ్యాఖ్యానించారు. ‘‘నేను జార్ఖండ్ వాసినని బీహార్ ప్రభుత్వం అంటుంది. బీహార్ వాసినని జార్ఖండ్ ప్రభుత్వం అంటుంది.. చివరకు నాకు నేను భారతీయుడినని నిర్ణయించుకుని ఆ రకంగానే సెటిల్ అయిపోయాను...’’ అని రాష్ట్ర విభజనలో తన అనుభవాన్ని తెలిపారు. 
     
     ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే...
     న్యాయమూర్తి తుదిగా ఆదేశాలు ఇస్తూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014 ప్రకారం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇంజనీరింగ్ అడ్మిషన్లను జూలై 31 లోపు నిర్వహించాల్సి ఉంది. అయితే అడ్మిషన్ల నిర్వహణకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో విధివిధానాలను రూపొందించుకునేందుకు సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం అడిగింది. తగినంత సిబ్బంది లేరని విన్నవించింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి సైతం ఇదే విజ్ఞాపన చేసింది. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆగస్టు 31 వరకు గడువు పొడిగిస్తున్నాం...’’ అని ఆదేశాలు జారీచేశారు. స్థానికత గురించి ఏపీ తరఫు న్యాయవాదులు ప్రస్తావించగా.. ‘‘అడ్మిషన్లను ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014 కు లోబడి చేపట్టాలి’’ అని న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంలో ఏపీ సర్కారు తరఫు న్యాయవాది పి.పి.రావు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేసింది. అడ్మిషన్ల నిర్వహణలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వగలరు...’’ అని కోరారు. ‘‘పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకరామే నిర్వహించాలి’’ అని న్యాయమూర్తి పునరుద్ఘాటించారు. అంతకుముందు ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై ఏపీ సర్కారు తరఫు న్యాయవాదులు ప్రస్తావించగా.. ‘‘ఇది దానికి సంబంధించిన కేసు కాదు.. దాని గురించి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం...’’ అని న్యాయమూర్తి స్పందించారు. 
     
     అడ్మిషన్ల అధికారం ఏపీ ఉన్నత విద్యామండలిదే: ఏపీ న్యాయవాది
     కేసు విచారణ అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘అక్టోబరు 31 వరకు గడువు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆగస్టు 31 లోపే అడ్మిషన్లు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం అడ్మిషన్లు నిర్వహించాలి.  ఆ చట్టం ప్రకారమే అడ్మిషన్లు నిర్వహించాలని కోర్టు స్పష్టంచేసింది...’’ అని వివరించారు. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలులో ఉన్న అడ్మిషన్ల ప్రక్రియ, కోటాలు.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ పదేళ్ల పాటు అమలులో ఉంటాయని పునర్‌వ్యవస్థీకరణ చట్టం చెప్తోందని ఆయన గుర్తుచేశారు. అలాగే.. ఆ చట్టం ప్రకారం.. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించే అధికారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలిదేనని పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారమే అడ్మిషన్లను నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని చెప్పారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement