‘ఫేస్‌’ చూపించి వెళ్లిపోవచ్చు! | Face Reading Security Checking In RGIA In Hyderabad Soon | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 18 2018 5:11 AM | Last Updated on Tue, Sep 18 2018 5:11 AM

Face Reading Security Checking In RGIA In Hyderabad Soon - Sakshi

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

సాక్షి, హైదరాబాద్‌: ఇక ఫ్లైట్‌ మిస్సవుతామనే భయం లేదు. గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. ఫ్లైట్‌ టేకాఫ్‌ సమయానికి 10 నిమిషాలు ముందు ఎయిర్‌పోర్టులో వాలిపోవడం. క్షణంలో భద్రతా తనిఖీలు పూర్తి చేసుకొని.. ఎంచక్కా విమానం ఎక్కేయడం. ఇంతటి సదుపాయం ఎక్కడో కాదు.. మన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే. ఈ సరికొత్త సదుపాయం డిసెంబర్‌ నుంచి అమల్లోకి రానుంది. ఫేస్‌ రీడింగ్‌ టెక్నాలజీ ద్వారా భద్రతా తనిఖీలను సులభతరం చేసేందుకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చర్య లు చేపట్టారు. దీనిలో భాగంగానే తొలుత దేశీయ విమాన ప్రయాణికులకు దీన్ని అమల్లోకి తెచ్చి ఆ తర్వాత అంతర్జాతీయ ప్రయాణికులకూ విస్తరించనున్నారు. కొంతకాలంగా ఎయిర్‌పోర్టు సిబ్బంది తనిఖీల కోసం ఫేస్‌ రీడింగ్‌ టెక్నాలజీని ఎయిర్‌పోర్టులో విజయవంతంగా అమలు చేస్తున్నారు. సిబ్బంది తనిఖీల్లో ఈ పరిజ్ఞానం సత్ఫలితాలనివ్వడంతో ప్రయాణికులకు కూడా దీనిని విస్తరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మరి కొద్ది నెలల్లోనే ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. దేశంలో ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీని అమలు చేయనున్న మొట్టమొదటి ఎయిర్‌పోర్టు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయమే కానుంది.  

వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ చాలు..
వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌తో ప్రయాణికులు తమ వివరాలను ఒక్కసారి నమోదు చేసుకుంటే ఆ తర్వాత శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఎప్పుడు ప్రయాణం చేసినా ఎలాంటి తనిఖీలు లేకుండా నేరుగా లోనికి వెళ్లిపోవచ్చు. కొత్త విధానంలో ముందుగా ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించిన తర్వాత ఎంట్రన్స్‌లో గుర్తింపు, చిరునామా, ఆధార్, తదితర ధ్రువపత్రాలను అందజేసి అత్యాధునిక కెమెరాల వద్ద ముఖకవళికలను నమోదు చేసుకోవాలి. ఈ కొత్త విధానంలో భాగంగా ఎంట్రీ గేట్ల వద్ద హైటెక్‌ కెమెరాలు అమరుస్తారు. ఒక్కసారి ఇలా వివరాలు నమోదు చేసుకున్న ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఆ కెమెరాల వైపు చూడగానే అతడి వివరాలు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. దీంతో బోర్డింగ్‌ పాస్, గుర్తింపు కార్డులు చూపెట్టాల్సిన అవసరం లేకుండానే అధికారులు సదరు ప్రయాణికుడిని లోపలికి అనుమతిస్తారు.

‘‘ఇది అత్యంత భద్రతతో కూడిన విధానం. ప్రయాణికులకు ఇబ్బందులు ఉండవు. ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎంట్రీల్లో ఫేస్‌ రీడింగ్‌ విజయవంతంగా పూర్తయింది. ఈ ఫలితాలు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ మేరకు హైటెక్‌ కెమెరాలను ఏర్పాటు చేస్తాం’’అని ఎయిర్‌పోర్టు ఉన్నతా ధికారి ఒకరు తెలిపారు. శంషాబాద్‌ విమానాశ్రయాన్ని పూర్తిగా కాగిత రహితంగా, పర్యావరణహితంగా అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేపట్టారు. ఇందుకోసం బయోమెట్రిక్‌ పద్ధతిని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ 480 జాతీయ, అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 55,000 మందికి పైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. ఈ సరికొత్త విధానం అమల్లోకి వస్తే హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement