► ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇష్టారీతిగా ఆపరేషన్లు
► అనుమతి లేకుండానే ల్యాబ్‌ల నిర్వహణ
► అధ్వానంగా వైద్య సేవలు
► గాల్లో కలిసి పోతున్న రోగుల ప్రాణాలు
జనగామ: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ అధ్వానంగా మారింది. అడ్డదారి అనుమతులతో అధికారులను బోల్తాకొట్టిస్తూ ప్రైవేట్ దందా సాగిస్తున్నారు. క్వాలీఫైడ్ డాక్టర్ల పేరుతో పెద్దపెద్ద బోర్డులను ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు ఆస్పత్రిని అంగడి సరుకుగా మారుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని చిన్న పాటి జబ్బులకే వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ కమీషన్లు ఇచ్చే ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు.
స్కానింగ్ కేంద్రాలకు బ్రోకర్ల లింకు...
లింగనిర్ధారణ పరీక్షల్లో శిశవు ఎవరనే విషయాన్ని చెప్పవద్దని చట్టం ఉన్నా.. అది బ్రోకర్లకు చుట్టంగానే మారుతోంది. కమీషన్ల దందా సాగిస్తూ.. అమ్మ కడుపులో పెరుగుతున్న శిశువు ఆడ, మగ అని ముందే తెలుసుకుంటున్నారు. అలా పసిబిడ్డల ప్రాణాలను కళ్లు తెరవక ముందే పొట్టన బెట్టుకుంటున్నారు. ఈ తతంగంలో సూత్ర.. పాత్ర దారిలో పట్టణానికి చెందిన ఓ ఆర్‌ఎంపీతో పాటు మరి కొంతమంది ఉన్నట్లు తెలుస్తుంది. సదరు ఆర్‌ఎంపీ ఆయా స్కానింగ్ నిర్వాహకులతో చేతులు కలిపి లింగనిర్ధారణ పరీక్షల్లో కమీషన్ల దందా సాగిస్తున్నారు. పైసలకు కక్కుర్తి పడిన ఈయన అబార్షన్లను కూడా చేస్తూ మహాపాపాన్ని మూటగట్టు కుంటున్నాడు.
రోతపుట్టిస్తున్న ప్రైవేట్ దవాఖానాలు
జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు రోత పుట్టిస్తున్నాయి. ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, వార్డుల నిర్వహణ అత్యంత అధ్వానగా ఉంది. ప్రసూతి వచ్చి డెలివరీ అయిన తర్వాత వారిని గాలికి వదిలేస్తున్నారు. రాత్రి సమయంలో గైనకాలజిస్టు, స్టాఫ్ నర్సు ఉండాల్సిన దవాఖానాలో కింది స్థాయి సిబ్బందితో పని కానిచ్చేస్తున్నారు. ఎవరు పడితే వారు సెలెన్, ఇంజక్షన్, మందు గోలీలను ఇస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆస్పత్రి రిస్ట్రేషన్ సమయంలో క్వాలిఫైడ్ డాక్టర్ల సర్టిఫికెట్లను చూపిస్తూ అనుమతులు పొందుతున్నారు. రెండు మూడు నెలల పాటు అంతా సాఫీగా సాగిస్తున్న నిర్వాహకులు.. ఆ తర్వాత ప్రైవేట్‌గా ప్రాక్టీసు పొందిన వారిచే ప్రై‘వేటు’ వైద్యం చేయిస్తున్నారు.
‘అనస్తీషియా’ హల్‌చల్...
జిల్లా కేంద్రంలో 20 నర్సింగ్ హోంలు, 30 క్లినిక్ల వరకు ఉంటాయి. అయితే బచ్చన్నపేట, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, దేవరుప్పులతో పాటు పలు మండలాల్లోని ప్రైవేట్ క్లినిక్‌ల్లో అనస్తీషియా డాక్టర్లదే హవా కొనసాగుతోంది. కాన్పు సమయంలో మత్తు సూది ఇచ్చే డాక్టర్ ఏకంగా ఆపరేషన్లు చేస్తుండడం గమనార్హం. ఇక కొన్ని ఆస్పత్రుల్లో అనస్తీషియా డాక్టర్‌కు బదులుగా సదరు దవాఖానలో పని చేస్తున్న వైద్యులే మత్తు మందు ఇస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రైవేట్ ఆస్పత్రుల్లో గతంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలే ఇందుకు నిదర్శనం.
‘నాని’ సీజ్, ‘వినాయక్’ లైసెన్స్ రద్దు...
అబార్షన్ కేసులో నాని చిన్న పిల్లల ఆస్పత్రిని సీజ్ చేయగా.. వినాయక దవాఖానా లైసె న్స్‌ను రద్దు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కనీస మౌలిక వసతులు కూడా కరువయ్యాయి. అనుమతులు లేకుండా ల్యాబ్‌లను నిర్వహిస్తూ పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. అవసరమున్నా.. లేకున్నా రక్త పరీక్షలు మాత్రం ప్రైవేట్ డాక్టర్ మందుల చీటీలో తప్పనిసరిగా మారుతున్నాయి. నార్మల్ డెలివరీ అయ్యే పరిస్థితుల్లో నొప్పులు రావడం లేదని కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేస్తూ డబ్బుల కోసం కడుపును కోస్తున్నారు.
అబార్షన్ వెనక అసలు కథ..
ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ఓ మహిళకు అబార్షన్ చేసిన ఘటన అనేక మలుపులు తిరుగుతోంది. ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళకు అబార్షన్ చేస్తుం డగా ఓ అజ్ఞాత వ్యక్తి కలెక్టర్ శ్రీదేవసేనకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెం టనే స్పదించిన కలెక్టర్ సదరు ఆస్పత్రిని తనిఖీ చేయాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించడంతో వారు హుటాహుటిన వెళ్లారు. ముందుగానే సమాచారం అందుకున్న హిందువుల ఆరాధ్య దైవమైన దేవుడు పేరుతో ఉన్న ఓ ఆస్పత్రి నిర్వాహకులు వెంటనే సదరు మహిళను పక్కనే ఉన్న చిన్న పిల్లల నాని ఆస్పత్రికి తరలించారు. ఎప్పటిలాగే వైద్యారోగ్య శాఖ అధికారులు ఆ ఆస్పత్రికి వెళ్లి తనిఖీ చేసి.. ఏ మీలేదని తేల్చి చెప్పారు. ముందుగా కలెక్టర్‌కు ఫోన్ చేసిన ఆ వ్యక్తి మహిళను నాని ఆస్పత్రికి తీసుకువెళ్లి అబార్షన్ చేస్తున్నట్లు చెప్పడంతో దొంగతనం వెలుగు చూసింది. గత రాత్రి డీఎంహెచ్‌ఓ అన్న ప్రసన్నకుమారి వినాయక ఆస్పత్రినికి తనిఖీ చేయగా.. అంతా నకిలీలే బయట పడ్డారు. దీంతో ఆగ్రహించిన అమె ఆస్పత్రి లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
కఠిన చర్యలు తప్పవు
జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులపై నిఘా వేసినం. అనుమతులను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. వినాయక ఆస్పత్రి నిర్వహణ అధ్వానంగా మారింది. కింది స్థాయి వర్కర్లు ప్రసూతి చేసుకున్న వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. ల్యాబ్‌ను కూడా అనుమతులు లేకుండా నడిపిస్తున్నారు. ఇటీవల జరిగిన అబార్షన్ విషయంతో కూపీ లాగుతున్నాం. ఇందులో ఎవరి పాత్ర ఉందనే దానిపై పూర్తి ఆధారాలు సేకరించాం. ఎవరనీ వదిలిపెట్టం. – అన్న ప్రసన్నకుమారి, డీఎంహెచ్‌ఓ
‘క్వాలిఫై డాక్టర్ ఉన్నాడు.. ఆస్పత్రి నిర్వహణకు అన్ని సౌకర్యాలు కల్పించాం.. పేషెంట్లకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తాం..’ అని అనుమతులు తీసుకుంటున్న కొన్ని ప్రైవేట్ దవాఖానాలు అమాయకుల ప్రాణాలు గాలిలో కలిపేస్తున్నాయి. కత్తి పట్టడం వస్తే చాలు.. కడుపును కోసేస్తున్నారు. లింగనిర్ధారణ పరీక్షల పేరిట కమీషన్ల దందా సాగిస్తూ.. ఆడపిల్లను కడుపులోనే ఖతం చేస్తున్నారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుంటున్న వ్యక్తులు.. డాక్టర్ల పేరుతో డ్యూటీ చేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్నారు. రోగుల ప్రాణాలు పోతే మాకేంటిలే అన్న విధంగా జిల్లా కేంద్రంలో కొన్ని ప్రైవేట్ దవాఖానాల నిర్వాహకులు వ్యహరిస్తున్నారు. కొన ఊపిరితో ఆస్పత్రికి వచ్చే రోగులకు ప్రాణ భిక్షపెట్టే ఆస్పత్రులే.. ప్రాణాలు తీస్తుంటే.. వైద్యారోగ్య శాఖ మాత్రం గుడ్డితనంగా వ్యవహరిస్తోంది.