సాక్షి, హైదరాబాద్ : మీకు భారత పౌరసత్వం కావాలా? మీరు ఏ దేశస్తులైనా ఫర్వాలేదు. అంగట్లో ఆధార్, ముంగిట్లో పౌరసత్వం ఇవ్వడానికి మేం రెడీ..! ఇది ప్రస్తుతం మన భాగ్యనగరంలో చోటుచేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితి. దేశ భద్రతను పణంగా పెట్టి ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, ఆఖరికి పాస్‌పోర్టు కూడా రూ.10 మొదలుకుని రూ.2 వేలకు అమ్ముతున్న దారుణ స్థితి దాపురించింది. ఇప్పటికే పాతబస్తీలో దాదాపు 400 మంది వరకు అక్రమమార్గంలో ఆధార్‌కార్డులు సంపాదిం చారంటూ డీజీపీ కార్యాలయం కేంద్ర హోం శాఖకు ఇప్పటికే నివేదించింది. అయినా.. ఇలాంటి కేసులు పాతబస్తీలో ప్రతినెలా బయటపడుతూనే ఉండటం గమనార్హం.
నిఘా లోపం వల్లే..!
హైదరాబాద్‌పై ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రత్యేక నిఘా పెడతారు. గతంలో దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా.. దానికి హైదరాబాద్‌తో ఏదో సంబంధం ఉండటం పరిపాటిగా ఉండేది. ఇటీవల భారత ఆర్మీ లక్ష్యంగా పాకిస్తాన్ గూఢచార సంస్థ (ఐఎస్‌ఐ) ప్రయోగించిన హనీట్రాప్.. పాతబస్తీ కేంద్రంగా సాగుతోందని ఢిల్లీలో పోలీసులు గుర్తించి భగ్నం చేసిన విషయం తెలిసిందే. సహజంగానే పాతబస్తీకి విదేశీయుల తాకిడి అధికం. యాత్రికులతో పాటు ఆఫ్రికన్ విద్యార్థులు, మధ్యప్రాచ్య వ్యాపారులు, బంగ్లాదేశ్, మయన్మార్‌కు చెందిన శరణార్థులు వేలాదిమంది ఇక్కడ తలదాచుకుంటారు. వీరిలో శరణార్థులుగా వచ్చినవారిపై సరైన పోలీసు నిఘా కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 16 వేల మంది శరణార్థులు ఉంటారని అంచనా. అసలు వీరు ఎంత మంది ఉన్నారన్న విషయంపై స్పష్టమైన గణంకాలు కూడా పోలీసుల వద్ద లేవన్న విమర్శలు వినిపించాయి. దీంతో యథేచ్ఛగా గుర్తింపు కార్డులు అడ్డదారిలో సంపాదిస్తున్నారు.
అక్రమంగా పాస్‌పోర్టులు..
విదేశీయుల వద్ద పాస్‌పోర్టు లాంటి అత్యున్నత గుర్తింపు కార్డులు ఉండటం పలు అనుమానాలకు బీజం వేస్తోంది. శరణార్థుల డేటా పోలీసుల వద్ద లేకపోవడం వల్లే వారికి సులువుగా పాస్‌పోర్టులు దక్కుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. గతంలో పోలీసులు కొందరి వేలిముద్రలు, రక్తనమూనాలు తీసుకున్నారు. తర్వాత ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇదే వారికి కలిసి వస్తోంది. వాస్తవానికి బంగ్లాదేశీయులు, మయన్మార్ దేశస్తులు చూడటానికి భారతీయుల్లాగానే ఉంటారు. వీరు బిహార్, ఒడిశా, బెంగాల్ నుంచి వచ్చామని చెబుతూ ఈ కార్డులు పొందుతున్నారు. ఆధార్, పాన్, ఓటర్ కార్డులను సులువుగా నెట్ సెంటర్ల ద్వారా సులువుగా సంపాదిస్తున్నారు.
(కొందరు నెట్‌సెంటర్ల నిర్వాహకులు ఓటరు కార్డును రూ.10కే దరఖాస్తు చేస్తున్నారు). తర్వాత పాస్‌పోర్టుకు దరఖాస్తు చేస్తున్నారు. కానీ, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన కొందరు ఆఫ్రికా జాతీయుల్లా.. చూడగానే వారు విదేశీయులు అని ఇట్టే చెప్పేలా ఉంటారు. అలాంటి వారికి పాస్‌పోర్టులు రావడం చూసి అవాక్కవుతున్నారు. పాతబస్తీలో మయన్మార్, బంగ్లాదేశ్, యెమెన్ దేశాలకు చెందిన శరణార్థుల్లో చాలామంది అక్రమమార్గంలో పాస్‌పోర్టులు సంపాదించారు. వీరిలో కొందరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇంకా పట్టుబడని వారు చాలామందే ఉన్నారని సమాచారం. విదేశీయుల డేటా నిరంతరం నిర్వహించకపోవడం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతోందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పాస్‌పోర్టు జారీ విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment