వంటింట్లో కల్తీ మంట! | Fake ingreidients seized in hyderabad | Sakshi
Sakshi News home page

వంటింట్లో కల్తీ మంట!

Published Tue, Jun 20 2017 1:44 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

వంటింట్లో కల్తీ మంట! - Sakshi

- కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ అన్ని కల్తీనే
- నగరంలో అక్రమ తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు
- కల్తీ ఆహార పదార్థాల స్వాధీనం

హైదరాబాద్‌: వెంకటేశ్వర్లు ఎప్పటిలాగే కిరాణా దుకాణానికి వెళ్లి కావాల్సిన సరుకులన్నీ పట్టుకొచ్చాడు. రెండు మూడు రోజుల తరువాత ఇంట్లో అందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి వెళితే.. పరీక్షలు జరిపి ఆహారం కల్తీ జరిగిందని తేల్చారు. చివరికి వారు వినియోగించిన కారం, పసుపు కల్తీ అయిందని తేలింది. ఎప్పుడూ వాడే బ్రాండే అయినా ఎందుకు ఇలా.. అంటే పైన కవర్‌ మాత్రమే బ్రాండెడ్‌.. లోపల ఉన్న పదార్థం మాత్రం కల్తీ జరిగింది. నగరంలో ఇప్పుడు ఇలాంటి పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి.

గుట్టుచప్పుడు కాకుండా ఆహార కల్తీకి పాల్పడుతున్నాయి. హైజెనిక్‌ కండీషన్స్‌ ప్రొడక్ట్‌ అంటూ మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ఇలాంటి వాటిపై లాభం అధికంగా ఉండడంతో దుకాణ వాసులు అమ్మకానికి మొగ్గుచూపుతున్నారు. కల్తీ ఆహార పదార్థాలు వినియోగించిన వారు మాత్రం ఆసుపత్రులపాలవుతున్నారు. ఇలాంటి పరిశ్రమలపై పోలీసులు రెండు రోజులుగా దాడులు జరుపుతున్నారు.

దాడులు ఎక్కడ...
భారీ ఎత్తున కల్తీ ఆహార పదార్థాలను హబీబ్‌నగర్‌ పోలీసులు సీజ్‌ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా కల్తీ పసుపు, ధనియాలు, కారం, అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని తయారు చేస్తున్న పరిశ్రమపై దాడులు నిర్వహించారు. రూ.పది లక్షలకుపైగా కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

కల్తీకి వాడే రసాయనాలను ధ్వంసం చేశారు. బిహార్‌ రాష్ట్రానికి చెందిన నిర్వాహకుడు మహ్మద్‌ జావెద్‌ అక్తర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరిశ్రమలో పనిచేస్తున్న పది మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడిపై ఐపీసీ 272, 273, 336, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

తయారీ ఇలా...
మహ్మద్‌ జావెద్‌ అక్తర్‌ కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. నగరంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని అఫ్జల్‌సాగర్‌లో రెండు ఇళ్లను అద్దెకు తీసుకున్నాడు. ఈ ఇళ్లలో మిర్చి, పసుపు, ధనియాలు, అల్లం వెల్లుల్లి మిశ్రమాలను తయారు చేయిస్తున్నాడు. బిహార్‌ నుంచి తీసుకొచ్చిన కొందరు యువకులను ఈ పరిశ్రమలో పనికి పెట్టాడు. రాత్రివేళల్లో లోడింగ్, అన్‌లోడింగ్‌ చేస్తూ తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. నగరంలోనే కాకుండా బయటి జిల్లాలకు తరలిస్తున్నారు.

పదార్థాల సీజ్‌...
ఈ స్థావరాలపై పోలీసులు సోమవారం ఉదయాన్నే దాడులు చేశారు. దాడుల్లో భారీగా కల్తీ ఆహార పదార్థాలను సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన కల్తీ పదార్థాలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ పి.మధుకర్‌ స్వామి తెలిపారు.

కల్తీ ఇలా..
ఈ మిశ్రమాల తయారీలో మరుగుదొడ్లలో వాడే యాసిడ్, ఇతర రసాయన పదార్థాలు, వ్యర్థాలు, పౌడర్లు కలుపుతున్నారు. స్వస్త్, కింగ్, రాయల్, సదా బహర్, రోజ్‌.. పేర్లతో తయారు చేసిన కవర్లు, డబ్బాలను వాడుతున్నారు. హైజెనిక్‌ కండీషన్స్‌ ప్రొడక్ట్‌ అంటూ స్టిక్కర్లు అతికిస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement