
గాజీపూర్ వాగుపై ఉన్న బ్రిడ్జిపై నుంచి గర్భిణిని తరలిస్తున్న కుటుంబీకులు
పెద్దేముల్: వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. ఓ నిండుచూలాలిని కటుంబీకులు అతికష్టం మీద అసంపూర్తి బ్రిడ్జిని దాటించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో శిశువు మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలో మంగళవారం జరిగింది. వివరాలు.. కోట్‌పల్లి మండలం మారేపల్లి తండాకు చెందిన రుక్మిణిబాయి నిండు గర్భిణి. మంగళవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు 108 సమాచారం అందించారు. వాహనంలో తాండూరుకు బయలుదేరారు. మార్గంమధ్యలో గాజీపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడున్న అసంపూర్తి బ్రిడ్జి పైనుంచి వాహనాలు రాకపోకలు సాగించడం లేదు. దీంతో గర్భిణి కుటుంబీకులు అతికష్టం మీద బ్రిడ్జి పైనుంచి దాటించారు. అవతలి వైపు నుంచి ఆటోలో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు రుక్మిణిబాయికి ప్రసవం చేశారు. సకాలంలో గర్భిణిని తీసుకురాకపోవడంతో పరిస్థితి విషమించి శిశువు మృతిచెందింది. అసంపూర్తి బ్రిడ్జితోనే శిశువు మృతిచెందినట్లు కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment