
సాక్షి, హైదరాబాద్: ఎండిపోయిన ఆకుల్లో జీవం చూశాడు. ఆ జీవమే ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. లలిత కళా అకాడమీ పురస్కారం కూడా అందుకునేలా చేసింది. విలక్షణమైన శైలితో ఆధునిక చిత్రకళను సమున్నతంగా ఆవిష్కరించిన ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాష్ (80) హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. బుధవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. కూతురు చాలా రోజుల క్రితమే చనిపోయారు. బుధవారం సాయంత్రం ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ప్రముఖ చిత్రకారులు లక్ష్మాగౌడ్, తోట వైకుం ఠం, లక్ష్మణ్ ఏలే, ఎల్వీప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ గుళ్లపల్లి ఎన్ రావు, డాక్టర్ రమేశ్ ప్రసాద్, పలువురు వైద్యులు, చిత్రకారులు అంత్యక్రియల్లో పాల్గొని నివా ళులర్పించారు. చిత్రకళా రంగంలో అపారమైన అనుభవం ఉన్న ఆయన ఎంతోమందికి మార్గదర్శకులు గా నిలిచారని వారు కొనియాడారు. ఆయన మరణం చిత్రకళా రంగానికి తీరని లోటని అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో పుట్టి పెరిగిన ఆయన హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
సీసీఎంబీతో మొదలు..
మొదట సీసీఎంబీకి రెసిడెన్షియల్ ఆర్టిస్టుగా పని చేశారు. ఎన్నో అపురూప చిత్రకళా ఖండాలను గీయడంతోపాటు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో రెసిడెంట్ ఆర్టిస్టుగా చేరారు. ప్రముఖ చిత్రకారులు లక్ష్మాగౌడ్, తోట వైకుంఠ, దేవరాజ్‌లకు ఆయన సీనియర్. జేఎన్టీయూలో చదువుకునే రోజుల్లో హైదరాబాద్‌లోని ఇరుకు గల్లీలను వాస్తవిక ధోరణిలో చిత్రీకరించే వారు. చదువు పూర్తయ్యాక అప్రెంటిస్ కోసం ఢిల్లీలో ఉండే ప్రముఖ చిత్రకారుడు శ్రీరాం కుమార్ వద్దకు వెళ్లారు. ఆయన వద్ద శిష్యరికంతో తనలో దాగి ఉన్న అసలు సిసలు చిత్ర జగత్తు వెలుగులోకి వచ్చింది. ఆ రోజుల్లోనే పనికిరాని వస్తువులు, పారవేసిన చెత్త చెదారం నుంచి కళా సృజన చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాక తనని ఆటోమొబైల్ స్క్రాప్ ఎంతగా ఆకర్షించిందంటే.. అదే తనకు దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చి పెట్టింది. లలిత కళా అకాడమీ పురస్కారం అందుకునేలా చేసింది. అవశేషం, శిథిలం అనేవి సహజ ఉనికి అన్న భావన ఆయనలో స్థిరపడటం, అక్కడి నుంచి ఆయన స్థిరంగా తనను తాను అన్వేషించుకుని పోయేలా చేసింది. ఆటోమొబైల్ స్క్రాప్ తర్వాత ఆయనను వడలి పోయినవి, రాలిపోయిన ఆకులు ఎంతగానో ఆకర్షించాయి. వాటిని ‘డెడ్ లీవ్స్’అని అన్నప్పటికీ, ఆయనకు అవి మృత ప్రాయం కాదు. మృత్యువు కానే కాదు. ‘మృత్యువు కూడా విశ్వంలో ఒక జీవితమే’అని చెప్పేవారు.
సీఎం కేసీఆర్ సంతాపం...
చిత్రకారుడు సూర్యప్రకాశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ చిత్రకళకు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని తెచ్చి పెట్టిన చిత్రకారుడిగా సూర్యప్రకాశ్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment