కార్తెలు కరుగుతున్నా..వరుణుడి కరుణలేదు..!
- ఎడారిలా మారిన ఘనపురం.. సింగూరు ప్రాజెక్టు ఆందోళనకరం
- దుక్కులు దున్ని దిక్కులు చూస్తున్న రైతులు
- 20 వేల ఎకరాల రైతుల్లో ఆందోళన
మెదక్: కార్తెలు కరిగిపోతున్నా జిల్లాపై వరుణుడు కరుణ చూపడం లేదు. చుక్కనీరు లేక ఘనపురం ప్రాజెక్టు ఎడారిలా మారింది. ఆయకట్టు పరిధిలోని అన్నదాతలు దుక్కులు దున్ని దిక్కులు చూస్తున్నారు. 20 వేల ఎకరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అప్పు చేసి ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతన్న దుస్ధితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి.
రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు కార్తెలు గడుస్తున్నా...వరుణుడు మాత్రం కరుణించడం లేదు. డివిజన్ పరిధిలోని 18 మండలాల్లో ఆశించిన వర్షాలు లేక రైతులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. జూన్‌లో 2614.4మిల్లిమీటర్ల వర్షపాతం కురియాల్సి ఉండగా, 2035.2మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలైలో గురువారం నాటికి 1274.0మి.మీ.వర్షపాతం కురియాల్సి ఉండగా 27.8మి.మీవర్షపాతం మాత్రమే నమోదైంది. గత 15రోజులుగా వాతావరణ పరిస్థితి చూస్తే వేసవికాలాన్ని తలపిస్తోంది. రేగోడ్, కొల్చారం, చిన్నశంకరంపేట, రామాయంపేట, చేగుంట, వెల్దుర్తి, కౌడిపల్లి, ఆందోల్, పుల్కల్, జిన్నారం, హత్నూర, నర్సాపూర్, శివ్వంపేట మండలాల్లో ఈ నెల వర్షమే పడలేదు.
ఎడారిలా ఘనపురం
మెతుకు సీమకే బతుకునిచ్చి ఘనపురం ప్రాజెక్ట్‌కు గడ్డు పరిస్థితి ఏర్పడింది. కళకళలాడే ఘనపురం చుక్కనీరులేక ఎడారిని తలపిస్తోంది. ప్రాజెక్టు నిల్వ నీటి సామర్థ్యం 0.2టీఎంసీలు కాగా గత ఏడాది జూలై9న ప్రాజెక్ట్ 5అడుగుల నీరు నిల్వ ఉంది. ఈసారి మాత్రం ప్రాజెక్టులో చుక్కనీరులేక బీడు భూమిని తలపిస్తోంది. దీంతో ఆయకట్టు పరిధిలోని 20వేల ఎకరాల్లో ఎక్కడ వరి నార్లు పోయలేదు. జూన్‌నెలలో పడిన వర్షంతో కొంతమంది రైతులు దుక్కులు దున్నుకున్నారు. చాలా మంది రైతులు అప్పు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచారు. వర్షాలు కురియక పోవడంతో తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. బోర్ల కింద వేసిన వరి తుకాలు సైతం ఎండిపోతుండటంతో వాటిని రక్షించుకోవడానికి ట్యాంకర్లు, బిందెలతో నీళ్లు తెచ్చి నానా తంటాలు పడుతున్నారు.
సింగూర్‌లో డెడ్ స్టోరేజ్
ఘనపురం ప్రాజెక్ట్‌కు ఆధారమైన సింగూర్‌ప్రాజెక్ట్‌లో డెడ్‌స్టోరేజ్ కొనసాగుతుంది. 30 టీఎంసీల నిల్వ నీటి సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్‌లో 4.3 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. 0.2 టీఎంసీల నిలువ నీటి సామర్థ్యం గల ఘనపురం ప్రస్తుతం చుక్కనీరు కూడా లేకపోవడంతో ఎడారిని తలపిస్తోంది.
డెడ్ స్టోరేజ్‌లో సింగూర్
ఘనపురం ప్రాజెక్టుకు ఆధారమై సింగూర్‌ప్రాజెక్టులో డెడ్‌స్టోరేజ్ కొనసాగుతోంది. 30 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో 4.3టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. 0.2టీఎంసీల నిల్వ నీటి సామర్థ్యం గల ఘనపురంలో ప్రస్తుతం చుక్కనీరు కూడా లేకపోవడంతో ఎడారిని తలపిస్తోంది. ఆయకట్టు పరిధిలోని 20వేల ఎకరాల్లో పంటలు పండాలంటే కనీసం 2టీఎంసీల నీటిని 0.3టీఎంసీల చొప్పున ఆరు విడతలుగా ఇవ్వాలి. అయితే అటు సింగూర్‌లో ఇటు ఘనపురంలో నీరులేక మరోవైపు వర్షాలు కురియక కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పునర్వసు కార్తె రావడంతో తుకాలు వేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.