అప్పుల బాధతో ఆత్మహత్యకు యత్నించిన రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాలు....శామీర్‌పేట్ మండలం లాల్‌గడిమలక్‌పేట్ గ్రామానికి చెందిన బీర్కురి శ్రీశైలం(54) తనకున్న మూడెకరాల్లో వరి, కూరగాయలు సాగు చేశాడు. భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో పొలంలో వేసిన బోరు ఎండిపోయింది. దీంతో పంటలు కూడా దెబ్బతిన్నాయి.
ఐదేళ్లుగా ఇదేవిధంగా అతడు ఇబ్బంది పడుతున్నాడు. దీంతో రూ.5లక్షలకుపైగా అప్పు పేరుకుపోయింది. తీవ్ర ఆవేదనతో ఉన్న శ్రీశైలం నాలుగు రోజుల క్రితం పొలంలోనే పురుగు మందు తాగాడు. కుటుంబసభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అతనికి భార్య నీలమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు.