భూ సేకరణ చేసేది ఈ గ్రామ సరిహద్దులోనే..
సాక్షి , ఖమ్మం రఘునాథపాలెం: కలెక్టరేట్ నిర్మాణానికి అవసరమైన భూములకు ఎకరానికి రూ.5 కోట్ల చొప్పన చెల్లిస్తేనే ఇస్తామని రైతులు.. ప్రభుత్వ ధర ప్రకారం రూ.25 లక్షలు మాత్రమే ఇస్తామని రెవెన్యూ అధికారుల వాదనలతో బుధవారం తొలిసారి జరిగిన చర్చలు ఓ కొలిక్కి రాలేదు. కలెక్టర్ కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల భవన సముదాయ నిర్మాణానికి వి.వెంకటాయపాలెం వద్ద అవసరమైన భూమి 26.24 ఎకరాలు గుర్తించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన రైతులు, ప్లాట్ల యజమానుల పేర్లతో కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంట్లో 17 మంది రైతులకు చెందిన సుమారు 23 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
భూసేకరణ చట్టం ప్రకారం ధరల విషయంపై ప్రాథమికంగా రఘునాథపాలెం తహసీల్దార్ తిరుమలాచారి రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి 10 మంది రైతులు హాజరైనట్లు తెలిసింది. తమది వ్యవసాయ భూమి అయినప్పటికీ ఖమ్మం నగరానికి సమీపంలో ఉందని, రియల్ ఎస్టేట్ పరంగా మంచి డిమాండ్ ఉంటుందని, తదనుగుణంగా ఎకరానికి రూ.5 కోట్ల చొప్పున పరిహారం ఇప్పించాలని ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం.
అయితే మార్కెట్ ధర అధికారికంగా రూ.5 లక్షల వరకు ఉందని, దానికి మొత్తంగా రూ. 25 లక్షలు వస్తుందని తహశీల్దార్ చెప్పడంతో రైతులు వ్యతిరేకించినట్లు తెలిసింది. కనీసం రూ.2.50 నుంచి 3 కోట్ల వరకైనా ఇవ్వాలని కొందరు రైతులు తమ వాదన వినిపించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, డిమాండ్‌ను బట్టి రూ. 30 లక్షల నుంచి 50 లక్షల మధ్య ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారని కొందరు రైతులు చెప్పారు.
తాము కోట్లలో అడుగుతుంటే అధికారులు లక్షల్లోనే ఇస్తామంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా, మరోసారి ధరల విషయంపై రైతులతో చర్చించనున్నట్లు తెలిసింది. చివరిగా కలెక్టర్ సమక్షంలో మాట్లాడి ధర నిర్ణయించి సానుకూలంగా పరిష్కారమైతే రైతులకు వెంటనే పరిహారం చెల్లించి భూమి సేకరించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. రైతులు ఇవ్వడానికి ముందుకు రాకున్నా భూ సేకరణ చట్టం ప్రకారం తీసుకుంటామని చెపుతున్నారు. రైతులకు చెల్లించాలని నిర్ణయించిన ధర మొత్తాన్ని బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తామని చెపుతున్నారు. వ్యవసాయ భూముల ధరపై ఓ నిర్ణయానికి వస్తే.. తర్వాత సుమారు 23 మందికి చెందిన 3 ఎకరాలకు పైగా ఉన్న ప్లాట్ల ధర నిర్ణయిస్తారని తెలిసింది.