అన్నదాతకు ఎంత కష్టం
పరిగి: వర్షాకాలం ఆరంభమై నెలరోజులు గడుస్తున్నా వరుణుడు కరుణించడం లేదు. దీంతో సాగుకు సిద్ధమైన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అప్పుచేసి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేశామని, భూమి నుంచి బయటకొచ్చిన లేత మొలకలు ఎండతీవ్రతకు మాడిపోతున్నాయని వాపోతున్నారు. మే నెలాఖరులో రోహిణి కార్తెలో కురిసిన వర్షాలకు వేసిన విత్తనాలు మొలకెత్తాయని, ఇప్పుడవి చిన్నపాటి జల్లుకూడా లేకపోవడంతో ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మలివర్షం కోసం ఎదురుచూసిన రైతులు విత్తనాలు, ఎరువులు ఇళ్లలోనే నిల్వ చేసుకుని ఎదురు చూస్తున్నారు. కొందరు రైతులు మాడిపోతున్న మొలకలను చూస్తూ ఊరుకోలేక కూలీలతో మొక్క మొక్కకూ నీరు పోయిస్తున్నారు. ఎండాకాలంలో వానలు కురిసి.. వర్షాకాలంలో ఎండలు కొట్ట డం వింతగా ఉందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
చెలకపొలాల్లో ఎండుతున్న మొలకలు
రేగడి పొలాలున్న రైతులు ఇంకాస్త వర్షం కురిశాక విత్తనాలు వేద్దామని ఎదురుచూస్తూ గడపగా.. చెలక, ఇసుక పొలాలున్న రైతులు నెలక్రితం కురిసిన వానలకే విత్తనాలు వేశారు. ప్రధానంగా పరిగి మండలంలోని రంగంపల్లి, రంగంపల్లి తండా, శలిమజాల తండా, గోవిందాపూర్ తండా, ఇబ్రహీంపూర్, ఇబ్రహీంపూర్ తండాల్లో ఇసుకపేలలు ఉండటంతో నెలక్రితమే విత్తనాలు వేశారు.
ప్రధానంగా శలిమజాల తండాలో అడుగువరకు మొలకలు పెరిగాయి. ఓ పక్క పొలాల్లో నిండుగా మొలకలు మొలకెత్తాయని ఆనందిస్తున్న తరుణంలో ఎండల తాకిడి ఒక్కసారిగా కుదేలు చేస్తోంది. దీంతో మాడిపోతున్న మొక్కల్ని చూస్తూ తట్టుకోలేక గురువారం మండలంలోని శలిమజాల తండాలో గిరిజన రైతులు మొలకలకు నీరు పోస్తూ కనిపించారు.
ఈ తండాకు చెందిన నర్సింగ్ నాయక్, నార్య నాయక్, పాండ్యా నాయక్, తుల్జా నాయక్‌లు తలా నాలుగెకరాల పొలంలో మొక్కజొన్నలు వేశారు. మొలిచిన మొలకలు మాడిపోయే దశకు చేరుకోవటంతో కుటుంబసభ్యులతో పాటు కూలీలతో మొలకలకు నీళ్లు పోస్తున్నారు. మొక్క మొక్కకు నీరుపోస్తున్న మహిళా రైతు బుద్లాబాయిని పలకరించగా బోరున విలపిస్తూ.. ఎండిపోతున్న మొలకలను చూపిస్తూ కన్నీటిపర్యంతమైంది.