మాకు చావే శరణ్యం
దోమకొండ : ప్రభుత్వం ఏడు గంటల విద్యుత్ ఇస్తామని ప్రకటించాలని, లేకుంటే పంటలు ఎండితే తమకు చావే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూములకు నిరంతరంగా ఏడు గంటలపాటు విద్యుత్ అందించాలని కోరుతూ మండలంలోని మందాపూర్ గ్రామానికి చెందిన రైతులు సోమవారం సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. విద్యుత్ సిబ్బందిని నిర్బంధించారు. వర్షాలు లేక పంటలు వేయలేదని బోర్ల కింద వేసిన పంటలు విద్యుత్ లేక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు నిరంతరంగా ఏడు గంటల పాటు విద్యుత్‌ను అందించాలని కోరారు. అనంతరం రైతులు లైన్ ఇన్‌స్పెక్టర్ ఎల్లయ్య, లైన్‌మెన్‌లు సుధాకర్, దేవరాజ్, ఆపరేటర్ సురేష్‌లను గదిలో నిర్బంధించారు. ఏఈ రావాలని నినాదాలు చేశారు. సబ్‌స్టేషన్ ఎదుట గంటపాటు ధ ర్నా నిర్వహించారు. కార్యక్రమంలో రైతులు గంగరాములు,రాజిరెడ్డి, నాగిరెడ్డి, సంజీవ్‌రెడ్డి, దేవేందర్, నాగరాజ్‌గౌడ్, ఉపసర్పంచ్ బాగారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు యాచం నరేందర్, కాంగ్రెస్ నాయకులు నాగరాజ్‌గౌడ్, రాజనర్సు తదితరులు ఉన్నారు.
విద్యుత్ సక్రమంగా సరాఫరా చేయండి
వర్ని : మండలంలోని రుద్రూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని లింగంపల్లి శివారుకు సక్రమంగా విద్యుత్‌ను సరఫరా చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు సోమవారం ఆందోళన చేశారు. సబ్‌స్టేషన్‌ను ముట్టడించి సిబ్బందిని నిలదీశారు. విద్యుత్‌ను నమ్ముకుని బోర్ల ద్వారా నాట్లు వేశామని విద్యుత్ కోతల వల్ల పంట ఎండి పోయే దశకు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఐదు గంటలు కూడా సక్రమంగా ఇవ్వడంలేదన్నారు. దీనిపై సిబ్బంది చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని రైతులు వారిని గదిలో నిర్బం ధించారు.
ఏఈ వచ్చేవరకు ఆందోళన విరమించబోమని మొండికేశారు. సమాచారం తెలుసుకున్న ఏఈ నర్సింలు, అసిస్టెంట్ ఏఈ గోపికృష్ణ సబ్‌స్టేషన్‌కు రాగానే వారిని రైతులు నిలదీశారు. శనివారం నుంచి సోమవారం ఉదయం వరకు కేవలం మూడు గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ ఇచ్చారని మండి పడ్డారు. రోజుకు ఏడు గంటలు ఇస్తామని ప్రక టించి మూడు గంటలు సరఫరా చేయడమేంటని ప్రశ్నిం చారు.
రాత్రి వేళ విద్యుత్ రావడం లేదని ఆరోపిం చారు. ఫీడర్‌లను మార్పు చేయడం వల్ల కొంతమేర సరఫరాలో అంతరాయం జరిగిందని, సక్రమంగా విద్యుత్ సరఫరా జరిగే విధంగా చూస్తానని ఏఈ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఆందోళనలో రైతులు పోశెట్టి, బాగయ్య, గంగాధర్, బాలు, పర్వయ్య, వీరేశం తదితరులు పాల్గొన్నారు.