సాక్షి, హైదరాబాద్: జిల్లా రైతు సమన్వయ సమితుల జాబితా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతికి అందింది. ఇప్పటివరకు 22 జిల్లాల సమితుల జాబితా పూర్తవగా.. వాటన్నింటినీ వ్యవసాయ శాఖ సీఎంకు సోమవారం అందజేసింది. నేడో రేపో మిగిలిన జిల్లాల జాబితాను కేసీఆర్‌కు అందజేయనుంది. ఆయా జిల్లాల జాబితాల్లో మార్పులు చేర్పులు చేసి తుది జాబితాను ముఖ్యమంత్రే ప్రకటిస్తారని, ఆ తర్వాతే ఉత్తర్వులు జారీ చేస్తారని అధికారులు చెబుతున్నారు. తొలుత జిల్లా సమితులను మంత్రులు ఆమోదించగా.. వాటిపై కలెక్టర్లు తుది నిర్ణయం తీసుకొని వ్యవసాయ శాఖకు పంపించారు. వీటికి ఉత్తర్వులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుండగా.. ముందుగా తన వద్దకు పంపాలని, ఆ తర్వాతే జీవోలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. జిల్లా సమితుల నుంచే రాష్ట్ర స్థాయి సమితి సభ్యులను నియమిస్తారు. రాష్ట్ర సమితి సభ్యులను సీఎం ఎంపిక చేసి ప్రకటిస్తారు.
కార్పొరేషన్ ఏర్పాటుపై ఉత్కంఠ
ఈనెల 25, 26 తేదీల్లో రెండు చోట్ల మండల, జిల్లా రైతు సమన్వయ సమితులతో ముఖ్యమంత్రి ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. ఆ సదస్సుల్లోగా రాష్ట్రస్థాయి రైతు సమితి నియామకం, కార్పొరేషన్ ఏర్పాటు ఉంటుందా లేదా అన్న చర్చ జోరుగా జరుగుతోంది. ‘25, 26 తేదీల్లో జరిగే రైతు సమితి సదస్సుల నాటికి రాష్ట్రస్థాయి సమితిని ఆగమేఘాల మీద ఏర్పాటు చేయాలన్న రూలేం లేదు. ఏర్పాటైతే సరేసరి. లేకుంటే రాష్ట్ర సమితి సభ్యులు లేకుండానే మండల, జిల్లా సమితులతో సదస్సులు నిర్వహిస్తాం’అని ఇటీవలి సమావేశంలో సీఎం అన్నట్లు తెలిసింది.
మంత్రులకు బాధ్యతలు
జిల్లా సమన్వయ సమితుల చైర్మన్ల నియామకాల కోసం ప్రతిపాదనలను పంపాలని మంత్రులను సీఎం కోరారు. జిల్లా స్థాయిలో నాయకుల మధ్య సమతూకం, సామాజిక వర్గాల మధ్య సమతుల్యం, గతంలో జిల్లా స్థాయి పదవుల్లో కీలకంగా ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని అవకాశాలు ఇవ్వాలనే సూచనలతో జిల్లా సమితి చైర్మన్‌కు ప్రతిపాదనలు పంపాలని నిర్దేశించారు. జిల్లా పరిషత్ చైర్మన్, డీసీసీబీ, గ్రంథాలయ సంస్థ వంటి నామినేటెడ్ పదవుల్లో ఏయే వర్గాలకు అవకాశం వచ్చిందో దృష్టిలో పెట్టుకుని, ఇప్పటిదాకా అవకాశాలు రాని నాయకులకు, వర్గాలకు ప్రాధాన్యత కల్పించేలా ప్రతిపాదనలను పంపాలని సూచనలు చేశారు. జిల్లా స్థాయిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలను సమన్వయం చేసుకుంటూ ప్రతిపాదనలను పంపే బాధ్యత పాత జిల్లా ఇన్‌చార్జ్‌లకు అప్పగించారు.
మెజారిటీ జిల్లా సమితులు కొలిక్కి
జిల్లా సమితుల చైర్మన్ల నియామకాలకు సంబంధించి పాత మెదక్ జిల్లా నేతలతో ఇన్‌చార్జ్ మంత్రి టి.హరీశ్‌రావు సమావేశమై.. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు ఒక్కొక్క పేరును ప్రతిపాదించినట్టుగా తెలిసింది. అలాగే పాత రంగారెడ్డి జిల్లాకు సంబంధించి పట్నం మహేందర్‌రెడ్డి.. వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు పేర్లను ప్రతిపాదించారు. మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన అనుచరుని కోసం పట్టుబట్టి సాధించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక పాత మహబూబ్‌నగర్ జిల్లా విషయంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి మధ్య కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా, ఒక్కొక్క పేరుతోనే ప్రతిపాదనలను పంపినట్టుగా సమాచారం. పాత నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి కూడా ప్రతిపాదనలు అందాయి. వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని సమితుల విషయంలో ఇంకా ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. కొత్తగూడెం విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, కనకయ్య తమ వారి కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. నాలుగైదు జిల్లాలు మినహా అన్ని సమితులపై స్పష్టత వచ్చినట్టేనని సమాచారం.
జిల్లాకో పర్యవేక్షణాధికారి
ఇక ఈనెల 25, 26 తేదీల్లో జరిగే రైతు సమితుల సదస్సులను విజయవంతం చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. జిల్లాకో రాష్ట్ర వ్యవసాయాధికారిని పర్యవేక్షణాధికారిగా నియమించింది. వారి ఆధ్వర్యంలోనే రైతు సభ్యులు, ఇతర అధికారులు సదస్సులకు తరలివస్తారు. వారిని తరలించేందుకు 344 బస్సులను సిద్ధం చేస్తున్నారు. 17,026 మందికి ఆహ్వానాలు పంపారు. 25వ తేదీన హైదరాబాద్ సభకు 13 జిల్లాల నుంచి తరలివస్తారు. మిగిలిన జిల్లాలకు చెందినవారు 26వ తేదీన కరీంనగర్‌లో జరిగే సభకు తరలివస్తారు.
కార్పొరేషన్ చైర్మన్‌గా గుత్తా!
రైతు కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఖరారైనట్లేనని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సమితులపై ఇటీవలి సీఎం సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకుండా గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఆహ్వానించారంటే ఆయనే చైర్మన్ అని సంకేతం పంపినట్లేనని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర సమితిలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులకు కూడా చోటు ఇవ్వాలని సీఎం నిర్ణయించినందున వారు ఎవరనే చర్చ జరుగుతోంది. వ్యవసాయ వర్సిటీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు, ఇతర నిపుణులు ఉంటారని చెబుతున్నారు. మొత్తం 42 మందితో కూడిన రాష్ట్ర సమితిలో 30 మందిని జిల్లా సమితుల నుంచి తీసుకుంటారని, మిగిలిన 12 మంది.. నేతలు, నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలను సీఎం నామినేట్ చేస్తారని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment