భూమి ఇచ్చి బిచ్చమెత్తుకోవాలా?
♦ మేడిగడ్డసభలో అధికారులతో రైతుల వాగ్వాదం
♦ భూములు ఇవ్వకుంటే..బలవంతంగా తీసుకుంటాం: జేసీ
మహదేవపూర్:‘భూమిని నమ్ముకుని బతుకుతున్నాం.. ఉన్నపళంగా భూములిచ్చి అడుక్కుతినాలా? అంటూ నిర్వాసితులు అధికార యంత్రాంగంపై విరుచుకుపడ్డారు. కాదూ కూడదంటే తమ భూముల్లోనే ఆత్మహత్యలు చేసు కుంటామని హెచ్చరించారు. సముదాయించాల్సిన జేసీ.. రైతులపై బెదిరింపులకు దిగారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద బుధవారం నిర్వాసిత రైతులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. బుధవారం మేడిగడ్డలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశానికి జాయింట్ కలెక్టర్ అమయ్‌కుమార్, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జేసీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిర్వాసితు లకు రిజిస్ట్రేషన్ విలువకు పదింతలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఈ ప్రాంతంలో ఎకరానికి రూ.7.50 లక్షల వరకు చెల్లిస్తామన్నారు. అయితే, ప్రాణాలు పోయినా సరే ఆ రేటుకు భూమలు ఇవ్వబోమని.. ఎకరానికి రూ.20 లక్షలు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని, అర్హులైనవారికి ఉద్యోగాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. భూములి వ్వకున్నా బలవంతంగా ప్రాజెక్టులు పనులు ప్రారంభిస్తా మని జేసీ స్పష్టం చేశారు. అంతవిలువైన భూములున్న మీకు రేషన్ కార్డుల ను రద్దు చేస్తామని జేసీ బెదిరించారు. జేసీ చెప్పిన రేటుకు రైతులు అంగీకరించకపోవడంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది. సాయంత్రం పోలీసు పహారా మధ్య మేడిగడ్డ వద్ద గల భూమిలో జేసీబీలతో పనులు ప్రారంభించగా రైతులు అడ్డుకున్నారు.