ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌లైన్: జిల్లాలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలుల బీభత్సంతో 2,142 ఎకరాల్లో మాత్రమే పంటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు వి.బి.భాస్కర్ రావు, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు జినుగు మరియన్న ఆదివారం ప్రకటించారు. జిల్లాలో 95 శాతం వరి కోతలు పూర్తయ్యాయని, 5 శాతం వరి పంటలకు మాత్రమే నష్టం వాటిల్లిందని జేడీఏ భాస్కర్ రావు తెలిపారు. ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, పాల్వంచ, పెనుబల్లి, అశ్వాపురం, కామేపల్లి, వైరా, కొత్తగూడెం, పినపాక మండలాల్లోని 36 గ్రామాలకు చెందిన 1,116 మంది రైతుల 1637(655 హెక్టార్లు) ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు ఆయన వివరించారు.
ఇవే మండలాలలోని 12 గ్రామాలకు చెందిన 188 రైతుల 245 (98 హెక్టార్లు) ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక నివేదికలు రూపొందించామన్నారు. సమగ్ర నివేదికలు రూపొందించేందుకు మండలాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందంలో మండల వ్యవసాయాధికారి, తహశీల్దార్, వ్యవసాయ విస్తరణాధికారి, గ్రామ రెవెన్యూ అధికారులు ఉంటారని చెప్పారు. 50 శాతానికి పైగా పంట నష్టం వాటిల్లిన పంటలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. వరి పంట నష్టానికి హెక్టారుకు రూ.10 వేలు, మొక్కజొన్నకు హెక్టారుకు రూ. 6 వేల చొప్పున చెల్లించేలా నిబంధనలు ఉన్నాయని తెలిపారు.
ఉద్యానవన శాఖ పంట నష్టాలిలా...
జిల్లాలో 150 ఎకరాల్లో మామిడి కాత రాలిందని ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు మరియన్న తెలిపారు. మిర్చి కల్లాల్లో ఆరబోశారని, వాటిని టార్పాలిన్‌లతో కప్పి రక్షిస్తున్నారని చెప్పారు. బొప్పాయి 100 ఎకరాల్లో నేల కూలిపోయిందన్నారు. మునగ చెట్లు 10 ఎకరాల్లో నేల కూలాయని తెలిపారు. బొప్పాయి, మునగ తోటలకు హెక్టారుకు రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ప్రాథమిక అంచనాలు రూపొందించామని, 16వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెపుతుండడంతో ఆ తర్వాతే సమగ్ర నివేదిక రూపొందించి కలెక్టర్‌కు అందజేస్తామని వివరించారు. వ్యవసాయ మార్కెట్లలో తడిసిన పంటలను కూడా గుర్తించి నివేదికలు అందజేయాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశించినా.. మార్కెటింగ్ శాఖ అధికారులు ఆ దిశగా వివరాలను, తడిసిన పంట నష్టాలను గుర్తించటం లేదు. కాగా, కల్లాల్లో తడిసిన మిర్చి నష్ట పరిహారంలోకి రాదని అధికారులు చెబుతుండడం గమనార్హం.
భారీ నష్టం వాటిల్లినా.. అంత లేదంటున్న అధికారులు..
జిల్లాలో కోట్ల రూపాయల విలువైన పంటలు అకాల వర్షాలకు, ఈదురు గాలులకు నష్టపోయినా ప్రభుత్వ శాఖలు మాత్రం అంత నష్టం జరగలేదని చెపుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పంట నష్టం జరిగినా.. కేవలం 10 మండలాల్లోనే నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. భద్రాచ లం, కొత్తగూడెం, పాల్వంచ, ఖమ్మం డివిజన్లలోని అన్ని మండలాల్లో పంటలకు నష్టం జరిగింది. అశ్వారావుపేట, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, చండ్రుగొండ తదితర మండలాల్లో ఉద్యానవన పంటలైన అరటి, మామిడి, బొప్పాయి, మునగ పంటలకు నష్టం వాటిల్లగా అంతగా నష్టం లేదని, చెట్లు కూలిపోతేనే నష్ట పరిహారం వర్తిస్తుందని అధికారులు చెపుతుండడం గమనార్హం. అయితే ప్రాథమిక అంచనాల కన్నా పంట నష్టం ఇంకా తక్కువగానే ఉంటుందని, అధికార బృందాలు సమగ్రంగా నివే దికలు రూపొందించి రెండు రోజుల్లో సమర్పించనున్నాయని వారు చెప్పడం విడ్డూరంగా ఉందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.
అకాల వర్షాలు, ఈదురు గాలుల బీభత్సంతో పంట నష్టం
Published Mon, May 12 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM
Advertisement
Advertisement