సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులకు రైతు బీమా వరమని రైతు కార్పొరేషన్ చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కౌలు రైతులకు రైతుబంధు చెక్కులు ఇవ్వడం సాధ్యం కాదని, అయితే వారిలో 90 శాతం మందికి రైతు బీమాతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. మంగళవారం వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్‌మోహన్, అదనపు డైరెక్టర్ విజయ్‌కుమార్‌తో కలసి మాట్లాడారు. కౌలు రైతుల్లో చాలామందికి కొద్దోగొప్పో వ్యవసాయ భూమి ఉందని, వారే ఇంకొంత భూమి కౌలుకు తీసుకొని పనిచేస్తారని చెప్పారు. ఎంత వ్యవసాయ భూమి ఉన్నా అలాంటి వారందరికీ రైతు జీవిత బీమా వర్తిస్తుందన్నారు.
సంతోషంగా రాష్ట్ర రైతులు..
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు జరుగుతున్నాయని, కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, రైతుబంధు వంటి పథకాలు రూపొందించారని, ఉచిత కరెంటు ఇస్తున్నారని పేర్కొన్నారు. దీంతో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. రైతులకు సాయం చేసేందుకు 1.61 లక్షల మందితో రైతు సమన్వయ సమితుల సైన్యం ఏర్పాటైందన్నారు. ఇప్పటివరకు రైతుబంధు చెక్కులను 48.54 లక్షల మందికి ఇచ్చామని, అందులో 47.20 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో రూ.4,913 కోట్లు తీసుకున్నారని తెలిపారు. రైతు బీమా కింద ఇప్పటికే అధికారులు 27 లక్షల మంది రైతులను కలిశారని, వారిలో 22.08 లక్షల మంది రైతుల నుంచి నామినీ పత్రాలు స్వీకరించారన్నారు. వయసు, ఒకే రైతుకు రెండు మూడు ఖాతాలుండటం వంటి కారణాల వల్ల 20 శాతం మందిని రైతు బీమాకు అనర్హులుగా తేలారన్నారు.
రూ.2 లక్షల రుణమాఫీ ఎలా సాధ్యం?
ప్రతిపక్షాలు రైతు బంధు పథకంపై గోల చేస్తున్నాయని, వారు శవాలపై పేలాలు ఏరుకునేలా ప్రవర్తిస్తున్నారని గుత్తా మండిపడ్డారు. కాగా, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించడంపై మండిపడ్డారు. అదే నిజమైతే పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ఈ మేరకు ప్రకటన చేయాలని సవాల్ విసిరారు. రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటే రాష్ట్రంలో రెండేళ్లు అందరి జీతభత్యాలు మానుకొని ఇచ్చినా సరిపోవన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వాతావరణ యాప్‌ను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment