మార్కెటింగ్‌ మంత్రి వర్యా..మా మొర వింటారా ! | farmers request on Cost Prices : Minister Harish Rao | Sakshi
Sakshi News home page

మార్కెటింగ్‌ మంత్రి వర్యా..మా మొర వింటారా !

Published Tue, May 16 2017 4:27 AM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

మార్కెటింగ్‌ మంత్రి వర్యా..మా మొర వింటారా !

మార్కెటింగ్‌ మంత్రి వర్యా..మా మొర వింటారా !

బత్తాయి మార్కెట్‌కు శంకుస్థాపన సంతోషమే..
కానీ.. ఈ సారి బత్తాయి సీజన్‌కు ధరల ‘కత్తెర’
నిమ్మ రైతుకు కుచ్చుటోపీ పెడుతున్న ట్రేడర్లు
ధాన్యం అమ్మిన డబ్బులు రాక 16 వేల మంది రైతుల ఎదురుచూపులు
కందుల కొనుగోళ్లలో పడరాని కష్టాలు పడ్డ రైతన్న
మిర్చి రైతు కంట్లో ‘కారం’... అన్ని పండ్ల ధరలూ అదే పరిస్థితి
సిద్ధమైనా.. ప్రారంభానికి నోచని మార్కెటింగ్‌ గోదాములు
డీసీఎంఎస్‌లో రూ. కోట్ల కుంభకోణం.. సొంత ఆస్తుల్లా అమ్ముకున్న సిబ్బంది
మీరు దృష్టి పెడితేనే జిల్లా రైతాంగానికి ఊరట


సాక్షి, నల్లగొండ :  దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న బత్తాయి మార్కెట్‌ను ఏర్పాటు చేయడంలో భాగంగా తొలి అడుగు వేసేందుకు మంగళవారం జిల్లాకు వస్తున్న రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ మంత్రి టి.హరీశ్‌రావుకు రైతాంగం స్వాగతం పలుకుతోంది. రూ.వేల కోట్ల బత్తాయి టర్నోవర్‌ ఉన్న జిల్లాలో మార్కెట్‌ను నిర్మించాలన్న ఆలోచనతో శంకుస్థాపన చేసేందుకు ఆయన రావడం సంతోషంగానే ఉన్నా.. జిల్లా అన్నదాతలు మాత్రం సమస్యల సుడిగుండంలో విలవిల్లాడిపోతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక, అమ్ముకునేందుకు సౌకర్యాలు లేక రైతన్నలు పడరాని కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా మార్కెటింగ్‌ శాఖ దృష్టిపెట్టాల్సిన ఉద్యాన, వాణిజ్య పంటలకు తోడు ధాన్యం రైతులు ఈ సీజన్‌లో పంటను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 బత్తాయి, ధాన్యం విషయంలో దిగుబడులు ఊహించని విధంగా రావడంతో సమస్యలు రాగా, మిగిలిన పంటల విషయంలో మాత్రం అన్నదాత మోసానికి గురవుతున్నాడు. కందుల నుంచి మామిడి పంట వరకు అన్ని విషయాల్లోనూ రైతన్న శ్రమ నిలువు దోపిడీకి గురవుతోంది. అన్నదాతల కష్టాలు అలా ఉంటే.. జిల్లాలో వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మాణం పూర్తి చేసుకున్నా ప్రారంభానికి మాత్రం నోచుకోకపోవడం గమనార్హం. దీనికి తోడు జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌)లో ఇటీవల వెలుగుచూసిన కోట్ల రూపాయల కుంభకోణం కూడా జిల్లాలో చర్చనీయాంశమైంది. బత్తాయి మార్కెట్‌ శంకుస్థాపనకు వస్తున్న మంత్రి అన్ని విషయాలపై దృష్టి సారించి, జిల్లా యంత్రాంగానికి తగిన ఆదేశాలు ఇచ్చి.. రైతన్నల సమస్యలు పరిష్కారం అయ్యేలా, వారు కష్టాల కడలి నుంచి గట్టెక్కేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజానీకం ముక్తకంఠంతో కోరుతోంది.

ధాన్యం కష్టాలు అన్నీ ఇన్నీ కావు..
నాగార్జునసాగర్‌ బహుళార్ధ సాధక ప్రాజెక్ట్‌ ఉన్న నల్లగొండ జిల్లాలో «ప్రధాన పంట వరి కాగా.. ఈ సీజన్‌లో అన్నదాతలు పండించిన ధాన్యం అమ్ముకునేందుకు పడరాని కష్టాలు పడాల్సి వచ్చింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటివరకు ఈ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కేంద్రాలు ప్రారంభించిన సమయంలో కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో రోజుల తరబడి రైతులు మార్కెట్‌లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. మార్కెట్‌కు తెచ్చిన ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్లలేక, మార్కెట్‌లో అమ్ముకుని వెళ్లలేక సతమతమయ్యారు.

ఇక, అమ్ముకున్న తర్వాత కూడా వారికి డబ్బులు చెల్లించడంలో చాలా జాప్యం జరుగుతోంది. సాఫ్ట్‌వేర్‌ సమస్య పేరుతో ఈ సీజన్‌ మొత్తం ధాన్యం చెల్లింపుల్లో అన్నదాతలు ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. ఇప్పటివరకు 30 లక్షల టన్నుల వరకు ధాన్యాన్ని కొన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, ఐకేపీ సెంటర్లు ఆయా రైతులకు చెల్లింపులు చేయడంలో ఇంకా జాప్యం చేస్తున్నాయి. ఇప్పటివరకు రూ.460 కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లు జరగగా, ఇంకా రూ.170 కోట్లు  రైతులకు చెల్లించాల్సి ఉంది. 48 గంటల్లో ధాన్యం రైతులకు నగదు చెల్లిస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైంది.

నిమ్మ రైతుకు కుచ్చుటోపీ
నకిరేకల్‌ కేంద్రంగా జరిగే నిమ్మ వ్యాపారంలో ఈ సారి ఆ రైతు నిలువు దోపిడీకి గురయ్యాడు. గత సీజన్‌లో రూ.4వేల వరకు పలికిన నిమ్మ బస్తా ఈ సారి కేవలం రూ.1,000 నుంచి 1,200 వరకు మాత్రమే పలికింది. ఇందుకు స్థానిక ట్రేడర్లు సిండికేట్‌ కావడమే కారణం. అయితే.. ధరల అమలును పరిశీలించాల్సిన మార్కెటింగ్‌శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. దీంతో అడ్డగోలుగా కుమ్మక్కైన కమీషన్‌దారులు రైతులను నిలువునా ముంచేశాడు. బస్తా నిమ్మకాయలు అమ్ముకుని అన్ని ఖర్చులు పోను రూ.150 రూ.200 వరకు మాత్రమే ఇంటికి తీసుకెళ్లే పరిస్థితుల్లో నిమ్మ రైతు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇక్కడ నిమ్మ మార్కెట్‌ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే మోక్షం లభించినా ఇంతవరకు స్థలం ఎక్కడన్నదానిపైనే అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయంలో మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా మీరు చొరవ తీసుకుని.. వచ్చే సీజన్‌ నాటికైనా నిమ్మ మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని రైతాంగం కోరుతోంది.

బత్తాయి ధరలకు ‘కత్తెర’
సమైక్య రాష్ట్రంలోనే బత్తాయి పంటకు పేరొందిన నల్లగొండ జిల్లాలో ఈసారి కత్తెర సీజన్‌ కన్నీళ్లనే మిగిల్చింది. పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో ధరలు పెరగాల్సి ఉంది. కత్తెర సీజన్‌ కాబట్టి రూ 30 వేల నుంచి రూ.40 వేల వరకు ధర ఉంటుందని బత్తాయి రైతులు భావించినా.. వారి ఆశలు అడియాసలయ్యాయి. ఈ సారి సీజన్‌లో టన్ను ధర రూ.10 వేల నుంచి 12 వేలకు పడిపోయింది. దీంతో రైతులు కన్నీళ్లతోనే బత్తాయిని అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు బత్తాయి పంట సీజన్‌ 95 శాతం పూర్తయిన తర్వాత టన్నుకు రూ.27వేల ధర పలుకుతోంది.

మీ హయాంలో నల్లగొండ జిల్లాలో బత్తాయి మార్కెట్‌ ఏర్పాటు చేయడం ద్వారా రూ.18 వేల కోట్ల వరకు జరిగే వ్యాపారంలో ముఖ్యంగా రూ.200 నుంచి రూ.300 కోట్ల రూపాయల రవాణా ఖర్చులు రైతన్నకు మిగలనున్నాయి. అయితే, ఎస్సెల్బీసీ సమీపంలో 12 ఎకరాల్లో రూ.1.5 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ మార్కెట్‌లో ట్రేడ్‌ లైసెన్సులు ఇవ్వడంతో పాటు మార్కెటింగ్‌ శాఖ నిరంతర పర్యవేక్షణ ఉంటేనే మార్కెట్‌ ఏర్పాటు ఆంతర్యం నెరవేరనుంది. వీటికి తోడు జిల్లా వ్యాప్తంగా 2.53 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగుచేస్తున్నారు. అందులో బత్తాయి, మామిడి, సపోట,  జామ, బొప్పాయి, అరటి వంటి పంటలున్నాయి. వీటికి కూడా మద్దతు ధర లభించని దుస్థితి నెలకొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement