వరి.. ఉరి తాడయ్యింది
- అప్పులు వెంటాడాయి..
- వెరసి.. యువరైతు బలవన్మరణం
- జంగరాయి గ్రామంలో విషాదం
చిన్నశంకరంపేట: ఎంతో ఆశతో సాగుకు ఉపక్రమించాడు.. వరినాట్లు వేశాడు.. అంతలోనే బోరులో నీళ్లు తగ్గాయి.. అప్పులు చేసి రెండు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు.. అటు పంట సైతం ఎండుముఖం పడుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.. అప్పులోళ్ల ఒత్తిళ్లు పెరగిపోవడంతో చేసేది లేక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు,చిన్నశంకరంపేట ఎస్‌ఐ నగేష్ కథనం మేరకు.. చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్ (35)కు మూడున్నర ఎకరాల పొలం ఉంది. రెండెకరాల్లో వరినాట్లు వేశాడు.
కొద్దిరోజులుగా బోరులో నీటి మట్టం తగ్గడం.. పంటకు నీళ్లు సరిగా అందకపోవడంతో ఎండుదశకు వచ్చింది. అప్పులు చేసి వరుసగా రెండు బోర్లు తవ్వించాడు.. అయినా చుక్కనీరు రాకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. ఇటు పంట చేతికొచ్చే మార్గం లేక, అటు అప్పులు తీరే దారి కానరాక మనస్తాపం చెందాడు. స్థానిక బ్యాంకులో రూ.లక్షతో పాటు ప్రైవేట్‌గా మరో రూ.2 లక్షల అప్పులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అప్పులు తీర్చాలని ఒత్తిడి పెరుగుతుండటంతో మంగళవారం రాత్రి పొద్దుపోయాక తన పొలంలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు భార్య ఇందిరతో పాటు ఇద్దరు కుమారులు రాము,నిఖిల్ ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్టు ఎస్‌ఐ నగేష్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని మెదక్ ఏరియా అస్పత్రికి తరలించారు.