బంజారాహిల్స్: చెల్లని చెక్కు ఇచ్చి కొనుగోలు చేసిన బైక్‌తో ఉడాయించిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్‌కు చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి గత నెల 20వ తేదీన ఓఎల్‌ఎక్స్‌లో తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ విక్రయిస్తున్నట్లు వివరాలు ఉంచాడు. దానిని కొనుగోలు చేసేందుకు కేపీహెచ్‌బీ నిజాంపేట రోడ్డులో నివాసముండే ములగాడ రవికుమార్(30) అనే ఫ్యాషన్ డిజైనర్ ముందుకు వచ్చాడు.
ఆ బైక్‌ను తీసుకుని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వద్ద ఓ అపార్ట్‌మెంట్‌కు రావాలని ఇమ్రాన్‌ను ఫోన్‌లో కోరాడు. ఆ మేరకు బైక్ తీసుకురాగా రూ.75 వేలకు బేరం కుదుర్చుకున్న రవికుమార్, ఇమ్రాన్‌కు చెక్కు ఇచ్చాడు. అనంతరం బైక్ తీసుకుని వెళ్లిపోయాడు. తనకు ఇచ్చిన చెక్కు చెల్లనిదిగా తేలటంతో బాధితుడు.. రవికుమార్‌కు ఫోన్ చేశాడు. అతడు స్పందించక పోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కాల్‌డేటా ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి బైక్‌ను స్వాధీనం చేసుకొని బుధవారం రిమాండ్‌కు తరలించారు.