వేగంగా ‘మిషన్ కాకతీయ’ Fast 'mission Kakatiya' | Sakshi
Sakshi News home page

వేగంగా ‘మిషన్ కాకతీయ’

Published Sat, Mar 28 2015 1:47 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

Fast 'mission Kakatiya'

  • ఒక్కరోజే వంద చెరువుల పనులు ప్రారంభించిన ఎమ్మెల్యేలు
  •  5,915 చెరువులకు అనుమతులు
  • సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పనులు మరింత వేగం పుంజుకున్నాయి. శాసనసభ సమావేశాలు ముగియడంతో ఎమ్మెల్యేలు శుక్రవారం తమ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున చెరువు పనులను ప్రారంభించారు. శుక్రవారం ఒక్కరోజే వంద చెరువుల పనులు ఆరంభమయ్యాయని నీటి పారుదల శాఖ వెల్లడించింది. ఈ నెలాఖరు వరకు సుమారు 3వేల చెరువుల పనులు ఆరంభమయ్యే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 5,915 చెరువులకు పరిపాలన పరమైన అనుమతులు రాగా, 2,464 చెరువుల ఒప్పందాలు పూర్తయ్యాయని, అందులో 798 చెరువుల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అత్యధికంగా ఖమ్మంలో 235 చెరువులు ఆరంభం కాగా, అత్యల్పంగా (25) రంగారెడ్డిలో, తర్వాతి స్థానంలో మహబూబ్‌నగర్ (51) ఉంది.
     
    కలెక్టర్ల నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ


    మిషన్ కాకతీయ పనుల తీరును పర్యవేక్షించేందుకు పది జిల్లాలకు గానూ ఆ జిల్లాల కలెక్టర్ల అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది.  వీరు పనులు జరిగే రోజుల్లో వారానికోసారి, పనుల్లేని సమయంలో నెలకోసారి సమావేశమై పనుల పురోగతిపై సమీక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
     
    నిధుల మంజూరులో అధికారులకు బాధ్యతలు

    వరదల కారణంగా జరిగే నష్టాన్ని తాత్కాలిక పునరుద్ధరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధుల మంజూరులో వివిధ స్థాయిల్లోని అధికారులకు బాధ్యతలు కట్టబెడుతూ ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇచ్చింది. దీని ప్రకారం నామినేషన్‌పై పనులు ఇచ్చేందుకు ఈఎన్‌సీ రూ.5 లక్షలు, ఎస్‌ఈ రూ.2 లక్షలు, ఈఈ రూ.లక్ష వరకు మంజూరు చేసేందుకు అనుమతించారు. సాంకేతిక అనుమతులకు ఈఎన్‌సీకి పూర్తిస్థాయి అధికారాలివ్వగా, ఎస్‌ఈకి రూ.50 లక్షలు, ఈఈకి రూ.10 లక్షల వరకు అధికారం ఇచ్చారు. పరిపాలనా అనుమతులకు ఈఎన్‌సీకి రూ.10 లక్షలు, ఎస్‌ఈకి రూ.5 లక్షలు, ఈఈకి రూ.2 లక్షల వరకు అధికారం కల్పించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement