
ఫాస్ట్ పథకం ఇక లేదు: సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఫాస్ట్ పథకాన్ని రద్దు చేస్తున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. పాత ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. శుక్రవారం కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల ఫీజు బకాయిలకు రూ 862 కోట్లు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలులో 371డి నిబంధన పాటిస్తామన్నారు. ఫీజు బకాయిలు గత ప్రభుత్వం తమ నెత్తిన రుద్దిందని ఆవేదన వ్యక్తం చేశారు.
చెస్ట్ ఆస్పత్రి స్థలంలో సచివాలయం నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అన్ని కార్యాలయన్నీ ఒకచోట ఉండాలన్న ఉద్దేశంతోనే కొత్తగా సచివాలయం కట్టాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుత సచివాలయానికి భయంకరమైన వాస్తు దోషం ఉందన్నారు. అక్రమ భూముల క్రమబద్దీకరణలో మార్పులు చేశామన్నారు. 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్దీరిస్తామని చెప్పారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేసీఆర్ చెప్పారు. సాంస్కృతిక సారథి ద్వారా 550 మంది కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.