లంచం ఇవ్వలేక.. తండ్రీకూతుళ్ల ఆత్మహత్య
కూతురును రైలు కిందకు తోసి తండ్రి ఆత్మహత్య
మహబూబ్‌నగర: వైద్య సిబ్బందికి డబ్బులు ఇవ్వలేక.. భార్యకు వైద్యం చేయించుకోలేక మనస్తాపానికి గురై ఓ తండ్రి కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా వీరన్నపేట రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం, మృతుని సూసైడ్ నోట్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. జడ్చర్లకు చెందిన నాగలక్ష్మి రెండోకాన్పు కోసం తన భర్త చెన్నకేశవులు(35)తో కలిసి సోమవారం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. మరుసటి రోజు మగబిడ్డకు జన్మనిచ్చింది. సిబ్బంది ఆమెకు చికిత్స చేయించేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. అప్పటికి డబ్బులు ఇచ్చారు.
గురువారం మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు. దాంతో సిబ్బంది తీరుపై ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ శామ్యూల్‌కు ఫిర్యాదుచేశారు. సిబ్బంది డబ్బులకు వేధిస్తున్నారని, ఇవ్వకుంటే సరైన వైద్యం అందించడం లేదని మానసికక్షోభకు గురయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెన్నకేశవులు లేఖ రాసి జేబులో పెట్టుకుని కూతురు హర్షితతో కలిసి వీరన్నపేట సమీపంలో రైలుకిందపడి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న మృతుని భార్య నాగలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించింది.రైల్వేపోలీసులు మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్ తెలిపారు.
బాధ్యులపై చర్యలు
ఆస్పత్రిలో రోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న సిబ్బందిపై కఠినచర్యలు తీసుకుంటామని సూపరిటెండెంట్ డాక్టర్ శామ్యూల్ తెలిపారు. సూసైడ్‌నోట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు కలెక్టర్‌తో మాట్లాడతానని ఆయన చెప్పారు.