తుర్కపల్లి: ఓ తండ్రి మోటార్ సైకిల్ కోసం కన్న కొడుకునే కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తుర్కపల్లిలో గురువారం జరిగింది. మాదాపూర్ గ్రామ పరిధిలోని కేవ్లా తండాకు చెందిన సోనా, దేవసోతు దేవ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. భర్త తాగుడుకు బానిసై తరచూ హింసిస్తుండడంతో భార్య సోనా ఐదేళ్ల క్రితం తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. మూడేళ్ల క్రితం భార్యను పంపాలని వచ్చి అడిగిన సమయంలో మోటార్ సైకిల్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
ఈ క్రమంలో మాదాపూర్ పాఠశాలలో చదువుతున్న అతని పెద్దకుమారుడు వెంకటేశ్‌ను బుధవారం దేవ తీసుకెళ్లాడు. గమనించిన స్థానికులు సోనికి సమాచారం అందించారు. విద్యార్థి మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు బుధవారం రాత్రి దేవను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా మోటార్‌సైకిల్ కోసమే తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు చెప్పాడు.