
ఆడబిడ్డ పుట్టిందని..
9 నెలల చిన్నారిని గొంతు నులిమి చంపిన తండ్రి
ఆత్మకూర్: తొమ్మిది నెలల పసికందును కర్కశంగా గొంతునులిమి చంపాడు ఓ తండ్రి. ఈ ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. కర్నూల్ జిల్లా దేవరబండ కు చెందిన గిద్దయ్య బతుకుదెరువు కోసం 15 ఏళ్ల కిందట ఆత్మకూర్‌కు వలస వచ్చాడు. తన కుమారుడు ఈశ్వర్‌కు అయిజ మండలం కిష్టాపూర్‌కి చెందిన పార్వతితో మూడేళ్ల కిందట వివాహం జరిపించాడు. తొమ్మిది నెలల క్రితం పార్వతి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈశ్వర్ కూతురును చూడటానికి కూడా వెళ్లలేదు. 20 రోజుల కిందట పంచాయితీ పెట్టి తల్లిబిడ్డలను భర్తకు అప్పగించారు.
అప్పటి నుంచి తనకు కూతురు వద్దని, ఎందుకు కన్నావని భార్యను వేధించసాగాడు. మంగళవారం సాయంత్రం బైక్‌పై కూతురును బయటికి తీసుకెళ్లి కొద్దిసేపటి తర్వాత ఇంటికి తీసుకువచ్చి పాప చనిపోయిందని చెప్పాడు. ఎలా చనిపోయిందని తల్లి ప్రశ్నించడంతో బైక్‌పై నుంచి జారిపడిందని బుకాయించాడు. పార్వతి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలపడంతో వారు ఆత్మకూర్‌కు చేరుకున్నారు. ఈశ్వర్‌ను ఈ సంఘటనపై నిలదీయడంతో బైక్‌పై నుంచి జారిపడిందని మళ్లీ బుకాయించాడు. అనుమానం వచ్చిన పార్వతి తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్సై సీహెచ్ రాజు బృందం ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అనంతరం పాపను గొంతునులిమి తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.