తనయ కష్టం చూడలేక తండ్రి ఆత్మహత్య
అతనికి కూతురంటే ప్రాణం. భారీగా కట్నకానుకలు ఇచ్చి ఆమెకు పెళ్లి చేశాడు. పెళ్లరుున ఏడాదిన్నరకే ఆమెను అల్లుడు వేధిస్తుండడాన్ని తట్టుకోలేకపోయూడు. భర్త దగ్గర ఉండలేకపోతున్నానంటూ పుట్టింటికొచ్చి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కూతురిని చూసి ఆ తండ్రి గుండె చెరువైంది. ఆమె ఏదైనా అఘారుుత్యం చేసుకుంటుందేమోనని అతడు నిత్యం భయపడుతుండేవాడు. తీవ్రంగా మదనపడుతుండేవాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న తన చిట్టి తల్లికి వచ్చిన కష్టాన్ని చూసి తట్టుకోలేక, ఆమె కన్నీళ్లను తుడవలేక తనువు చాలించాడు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
వందనం (ఖమ్మం అర్బన్): తన కూతురిని అల్లుడు వేధిస్తుండడాన్ని తట్టుకోలేని ఓ వ్యక్తి పురుగు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబీకులు తెలిపిన ప్రకారం...వందనం గ్రామస్తుడు పున్నం నరసింహా రావు(43) తన చిన్న కూతురు శివాణిని, గోపాలపురం గ్రామానికి చెందిన దొండపాటి సురేష్‌కు ఇచ్చి 18 నెలల క్రితం వివాహం చేశాడు. హైదరాబాదులోగల ప్రైవేటుబ్యాంక్‌లో ఉద్యో గం చేస్తున్న సురేష్‌కు వివాహ సమయంలో నాలుగు ఎకరాల భూమి, కొంత బంగారం, సుమారు 60లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చాడు. శివాణి-సురేష్ దాంపత్యం జీవితం కొన్నాళ్లపాటు బాగానే సాగింది. వారు హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. అప్పటికే సురేష్‌కు తన సహోద్యోగితో వివాహేతర సంబంధం ఉంది.
శివాణిని వదిలించుకోవాలని నిర్ణరుుంచుకున్న సురేష్.. ఆమెను రకారకాలుగా హింసించసాగాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెబితే తట్టుకోలేరనే భయంతో ఆమె కొంతకాలం ఈ హింసను భరించించింది. చివరికి ఆమె రెండు నెలల కిందట పుట్టింటికి వచ్చి తన తల్లిదండ్రులకు మొత్తం విషయం చెప్పి విలపించింది. ఆమె ఇక్కడకు వచ్చిన తరువాత కూడా సురేష్ వేధించడం మానలేదు. ఆమెను బెదిరిస్తూ సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు పంపించసాగాడు.
తన కూతురు ఏదైనా అఘా యత్యం చేసుకుంటుందేమోనని నరసింహారావు నిత్యం భయపడుతుండేవాడు. ఈ వేదనతోనే అతడు గత మంగళవారం తన ఇంటి వద్ద పురుగు మందు తాగాడు. అప్పటి నుంచి హైదరాబాదులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు గురువారం రాత్రి మృతిచెందాడు. కూతురు శివాణిని అల్లుడు సురేష్‌తోపా టు అతని తమ్ముడు, తండ్రి వేధిస్తుండడాన్ని తట్టుకోలేకనే నరసింహారావు ఆత్మహత్య చేసుకున్నట్టుగా అతని కుటుంబీకులు చింతకాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మృతదేహంతో రాస్తారోకో
నరసింహారావు మృతదేహాన్ని అతని కుటుంబీ కులు, బంధువులు శుక్రవారం గోపాలపురం తీసుకొచ్చారు. సురేష్ ఇంటి ఎదుట ఖమ్మం- వైరా ప్రధాన రహదారిపై మృతదేహాన్ని ఉంచి రెండు గంటలపాటు ఆందోళనకు దిగారు. రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోవడంతో అర్బన్ సీఐ శ్రీధర్ వెళ్లి, డీఎస్పీతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని ఆందోళనకారులకు నచ్చచెప్పి శాంతింపచేశారు. అదే సమయంలో అటువైపు వచ్చిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆగారు. శివాణితో మాట్లాడారు. మృతుని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని సీఐని కోరారు.