తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై శంఖారావం పూరించిన టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. దేశవ్యాప్తంగా రాజకీయా లను ప్రభావితం చేసేలా భారీ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ అంశాలతో తొలిపోరు చేపట్టాలని.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీలో మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. జంతర్‌మంతర్ వద్ద చేసే ఈ ధర్నాకు రాష్ట్ర మంత్రులతో పాటు అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించాలని యోచిస్తున్నారు. ఈ నెలాఖరులోనే చలో ఢిల్లీ యాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు.
పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా..
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. దానికి అనుగుణంగా జాతీయస్థాయిలో పోరాటానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే ఢిల్లీ యాత్ర చేయాలన్నది ఆయన యోచన. పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇటు రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 28 వరకు జరిగే అవకాశాలున్నాయి. దీంతో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఢిల్లీ ధర్నా తేదీని ఖరారు చేయనున్నారు. భావ సారూప్యత ఉన్న వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఈ ధర్నాకు ఆహ్వానించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
రిజర్వేషన్లే ప్రధాన డిమాండ్‌గా..
రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల రిజర్వేషన్లను 12 శాతానికి, ఎస్టీల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచే బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గత ఏడాదే కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కానీ రాష్ట్రంలో ప్రతిపాదిత రిజర్వేషన్లతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించటంతో కేంద్రం కొర్రీలు పెట్టింది. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనకు కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ సంతృప్తి వ్యక్తం చేసినా.. ముస్లిం (బీసీ–ఈ) రిజర్వేషన్ కోటా పెంచే విషయంలో కేంద్ర హోంశాఖ, డీవోపీటీ అభ్యంతరం వ్యక్తం చేశాయి.
దీంతో కేంద్ర హోంశాఖ పేర్కొన్న అంశాలపై వివరణలు పంపాలని, అవసరమైనంత సమాచారాన్ని జత చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వాస్తవానికి తమిళనాడులాంటి రాష్ట్రాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని గుర్తుచేస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 46ను సవరించి తెలంగాణకు వెసులుబాటు కల్పించాలని పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు.
రాష్ట్రాలకే అప్పగించాలి
విద్య, ఉపాధి రంగాలు రాష్ట్రాల జాబితాలో ఉన్నాయని.. వాటిలో రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని కేంద్ర పరిధి నుంచి తప్పించి రాష్ట్రాలకు అప్పగించాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘చలో ఢిల్లీ’కి పిలుపునివ్వాలని.. అవసరమైతే జంతర్‌మంతర్ వేదికగా మహాధర్నాకు సైతం దిగాలని యోచిస్తున్నారు. ఇక ఎస్సీ వర్గీకరణ అంశం కూడా కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది.
గతంలో ఈ అంశంపై ప్రధాని దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రధాని నిరాకరించారు. ఈ నేపథ్యంలో చలో ఢిల్లీ మహా ధర్నాలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కూడా లేవనెత్తి ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని కేసీఆర్ యోచిస్తున్నారు. వర్గీకరణపై కూడా ఢిల్లీ కేంద్రంగా ఒత్తిడి పెంచాలనే వ్యూహంతో ఉన్నారు.
దీంతో ఈ రెండు అంశాలూ కలిపి కార్యాచరణ రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ యోచన, జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవడానికి స్వయంగా రంగంలోకి దిగుతానని కేసీఆర్ ప్రకటనల నేపథ్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. పనిలోపనిగా తనతో కలసి వచ్చే జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తారని ఆయన సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment