
సాక్షి, హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో మార్పు కోసం రూపుదిద్దుకోనున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రకటనకు టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభను వేదికగా చేసుకోవాలని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇదే వేదికపై ఫెడరల్ ఫ్రంట్‌పై పూర్తిస్థాయి రాజకీయ ప్రకటన చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై సన్నిహితులతో చర్చించినట్టు సమాచారం.
కార్యాచరణపై కసరత్తు..
కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా దేశంలోని ప్రాంతీయ పార్టీలను కూడగడతానని ప్రకటించిన కేసీఆర్.. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఆకర్షించి, ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు అనుసరించాల్సిన ఎత్తుగడలపై మథనం చేస్తున్నారు. దీనికోసం రాజకీయ, రాజకీయేతర మేధావులతో చర్చిస్తున్న ఆయన.. టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారు.
ఉద్యమం నాటి తరహాలో..
తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభలను నిర్వహించారు. వాటికి ఇతర రాష్ట్రాల్లోని పార్టీల అధినేతలు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్‌సింగ్ తదితరులు టీఆర్‌ఎస్ సభల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. అలా ఇతర పార్టీలు రాజకీయ వేదికలపై సంఘీభావం తెలపడం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది.
ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులోనూ అదే తరహాలో వ్యవహరించాలని.. కలసి వచ్చే రాజకీయ పార్టీల నేతలను, కూటమి పట్ల సానుకూలంగా ఉన్న నేతలను ఆహ్వానించాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా దేశవ్యాప్తంగా ఫెడరల్ ఫ్రంట్‌పై దృష్టి పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 27న నిర్వహించే భారీ బహిరంగసభను ఫెడరల్ ఫ్రంట్‌కు పునాదిగా మలచాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలిసింది.
10 లక్షల మందితో..
ఫెడరల్ ఫ్రంట్‌కు పునాది వేసే బహిరంగసభను తెలంగాణలో ఏర్పాటు చేయడం వల్ల దేశవ్యాప్తంగా మన రాష్ట్రంపై దృష్టి పడేలా చేయడం, టీఆర్‌ఎస్ కేడర్‌లో స్థైరం నింపడమనే రెండు లక్ష్యాలు నెరవేరుతాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లేదా నల్లగొండలో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ సన్నిహితులు చెబుతున్నారు.
దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల అధినేతలను, ప్రతినిధులను ఆహ్వానించనుండటంతో ఆ స్థాయిలోనే బహిరంగ సభ ఉండాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. కేసీఆర్ ఒకసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లి వస్తారని.. అనంతరం బహిరంగసభకు ఆహ్వానించే పార్టీల నాయకులు, ప్రతినిధుల జాబితా సిద్ధం కానుందని పేర్కొంటున్నారు.