మహిళా కండక్టర్లకు మంచిరోజులు.. | Female Conductors Only Work Until 8 pm In Telangana | Sakshi
Sakshi News home page

మహిళా కండక్టర్లకు మంచిరోజులు..

Published Mon, Dec 9 2019 9:23 AM | Last Updated on Mon, Dec 9 2019 9:23 AM

Female Conductors Only Work Until 8 pm In Telangana - Sakshi

సాక్షి, కరీంనగర్‌ :   ప్రజారవాణా సంస్థ ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళా కండక్టర్లకు మంచి రోజులు వస్తున్నాయి. ఏళ్ల తరబడి డ్యూటీ వేళలతో ఇబ్బంది పడుతున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీపి కబురు చెప్పారు. ఇటీవల ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో రాత్రి 8 గంటల వరకే విధులు నిర్వర్తించేలా చూడాలని, ఆ తర్వాత వారు విధుల నుంచి దిగిపోవాలని చెప్పారు. అందుకు సంబంధించిన ఆదేశాలను కూడా ఆర్టీసీ యాజమాన్యం ఆర్‌ఎంలకు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే కరీంనగర్‌ ఆర్టీసీ రీజియన్‌లోని ఆర్టీసీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్‌ మహిళా కండక్టర్ల వివరాలు, సంబంధిత విధుల సమయాలు అందించాలని డిపో మేనేజర్లను ఆదేశించారు. అధికారులు ఈ వివరాలు అందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు రాత్రి 10 గంటల వరకు మహిళా కండక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో వారు ఇళ్లకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో మహిళా కార్మికుల్లో సానుకూల స్పందన వస్తోంది. 

ఆర్టీసీ అధికారుల కసరత్తు... 
ఇన్నాళ్లు బస్సుల వేళలపై అంతగా దృష్టిసారించని ఆర్టీసీ అధికారులు సీఎం ఉత్తర్వులతో మహిళా ఉద్యోగులను రాత్రి 8 గంటలకే ఇంటికి పంపేలా వేళల విషయంలో కసరత్తు ప్రారంభించారు. డిపో నుంచి బస్సు బయలుదేరే సమయం, తిరిగి చేరుకునే సమయాన్ని (రన్నింగ్‌ టైం) డ్యూటీ చార్టులపై పక్కాగా నమోదు చేస్తున్నారు. బస్టాండ్‌ లేదా డిపో నుంచి నిర్ణీత గమ్యస్థానం చేరుకునే రూట్‌ సమయాన్ని కుదించినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రం నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో మహిళా కండక్టర్లకు డ్యూటీలు వేయకుండా డిపోకు 20 కిలోమీటర్ల వ్యవధిలో డ్యూటీలు వేస్తే సమయపాలన సరిపోతుంది. రాత్రి 8 గంటల లోపు డ్యూటీ ముగించుకునే  అవకాశం దొరుకుతుంది. ఈ మార్పులతో సిబ్బంది సకాలంలో విధులు ముగించుకుని త్వరగా ఇళ్లకు చేరుకునే ఆవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.  

మిగతా హామీలకు ఎదురుచూపులు... 
సీఎం ఇచ్చిన మిగతా హామీలపై కూడా మహిళా ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డిపోల్లో ప్రత్యేకంగా మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకోనేందుకు గది ఏర్పాటుపై కూడా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. పిల్లలకు బోధనా రుసుంలో రాయితీ, గృహ నిర్మాణ పథకం, ప్రసూతి సెలవులు, మూడు మాసాల శిశు సంరక్షణ సెలవులు తదితర వాటిపై మహిళా ఉద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు.  

రుణపడి ఉంటాం 
ప్రగతి భవన్‌లో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన వరాలు సంతోషాన్ని కలిగించాయి. మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలకే ఇళ్లకు చేరుకోవాలని సీఎం హామీ ఇవ్వడం సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడున్న డ్యూటీ చార్టుల్లో మార్పులు చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. స్పెషల్‌ ఆఫ్‌ డ్యూటీకి 14 గంటల సమయం పడుతోంది. జిల్లాలో చాలా రూట్లు సరిగా లేవు. అందుకే సమయంతోపాటు కిలో మీటర్లు కూడా తగ్గించాలి.  
– పి.సుజాత, కండక్టర్, కరీంనగర్‌–1 డిపో    

రక్షణగా ఉంటుంది.. 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయం మహిళలకు రక్షణగా ఉంటుంది. రాత్రిళ్లు 10 గంటల వరకు విధులు నిర్వర్తించే ఇంటికి వెళ్లాలంటే భయపడాల్సి వస్తుంది. 8 గంటలకే డ్యూటీలు దిగితే ఆ భయం ఉండదు. డిపోల్లో మరుగుదొడ్లను ఆధునికీకరించారు. బస్టాండ్లలోనూ మహిళా కండక్టర్లకు ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేయాలి. మాకు ఏదైనా సమస్య తలెత్తితే పరిష్కరించుకునేందుకు వీలుంటుంది.  
–సబితారాణి, కండక్టర్, కరీంనగర్‌–2 డిపో

ఉత్తర్వుల అమలుకు చర్యలు  
ఆర్టీసీలో ఎప్పటిలాగే రూట్‌ వేళలు అమలు చేస్తున్నాం. ఏ ఒక్కరూటులో ఇప్పటి వరకు రన్నింగ్‌ టైం కుదించలేదు. ఉత్తర్వుల మేరకు మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలలోపు ఇళ్లకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. వారికి డిపోల్లో దుస్తులు మార్చుకోవడానికి గదులు, మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. రీజియన్‌ పరిధిలో మహిళ ఉద్యోగులకు ఎలాంటి ఇక్కట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.
–జీవన్‌ప్రసాద్, ఆర్‌ఎం,  కరీంనగర్‌

డిపోల వారీగా మహిళా కండక్టర్లు

డిపో మహిళా కండక్టర్లు
కరీంనగర్‌–1  59
కరీంనగర్‌–2  60
హుజూరాబాద్‌ 57
గోదావరిఖని 65
జగిత్యాల 44
కోరుట్ల  15
మంథని  26
మెట్‌పల్లి 10
సిరిసిల్ల 29
వేములవాడ 22
మొత్తం  387

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement